జాతీయ జనాభా పట్టిక ప్రమాదకారి అని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత పి.చిదంబరం ఆరోపించారు. 2010లో తీసుకొచ్చిన ఎన్పీఆర్కు దీనికి పోలికే లేదన్నారు. ఎన్పీఆర్ను వివాదాస్పద జాతీయ పౌర పట్టికకు అనుసంధానం చేయొద్దని కోరారు.
"భాజపా ప్రభుత్వం కుటిల ఎజెండాతో ఉంది. అందుకే కేబినెట్ ఆమోదించిన ఎన్పీఆర్.. 2010తో పోలిస్తే విషయం, ఉద్దేశ్యం పరంగా చాలా భిన్నంగా ఉంది. ఇది చాలా ప్రమాదకారి.
ఒకవేళ భాజపా ఉద్దేశం మంచిదే అయితే.. ఎన్పీఆర్-2010 స్వరూపం, ఉద్దేశానికి బేషరతుగా మద్దతివ్వాలి. వివాదాస్పద ఎన్ఆర్సీతో అనుసంధానం చేసే ఆలోచన ఉండకూడదు."
- పి.చిదంబరం, కేంద్ర మాజీ మంత్రి
'సరిగా వినండి..'
కాంగ్రెస్ హయాంలో 2010లో ప్రవేశపెట్టిన ఎన్పీఆర్కు సంబంధించి భాజపా వీడియో విడుదల చేయటంపై చిదంబరం సంతోషం వ్యక్తం చేశారు. అందులోని మాటలను సరిగా వినాలని సూచించారు. ఎన్పీఆర్-2010లో స్థానికులని మాత్రమే ప్రస్తావించామని.. పౌరసత్వం, మత ప్రాతిపదికలను చేర్చలేదని స్పష్టం చేశారు. ఎన్ఆర్సీ ప్రస్తావనే రాలేదని, 2011 జనాభా గణన కోసమే తీసుకొచ్చినట్లు తెలిపారు.
భారతమాతకు అబద్ధమాడారు: రాహుల్
భారత్లో నిర్బంధ కేంద్రాలు లేవని ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మండిపడ్డారు. భారతమాతతో ఆర్ఎస్ఎస్ ప్రధానమంత్రి అబద్ధాలు చెబుతున్నారని విరుచుకుపడ్డారు. అసోంలో నిర్మితమవుతోన్న ఓ నిర్బంధ కేంద్రానికి సంబంధించిన వీడియోను రాహుల్ ట్విట్టర్లో పంచుకున్నారు.
ముస్లింలను నిర్బంధ కేంద్రాలకు తరలిస్తారంటూ కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు, అర్బన్ నక్సల్స్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని.. ఇటీవల ప్రధాని ఆరోపించారు.