మహారాష్ట్రలో రసవత్తర రాజకీయ పోరుకు పార్టీలన్నీ వ్యూహాలు రచిస్తున్నాయి. ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకొని అభ్యర్థులను బరిలోకి దింపుతున్నాయి. నామినేషన్లకు చివరిరోజైన ఇవాళ.. అధికార భాజపా ఏడుగురు అభ్యర్థులతో కూడిన నాలుగో జాబితాను విడుదల చేసింది. పార్టీ సీనియర్ నేత ఏక్నాథ్ ఖడ్సే, కేబినెట్ మంత్రి వినోద్ తావడేలకు నిరాశే ఎదురైంది.
ఏక్నాథ్ ఖాడ్సే బదులుగా ఆయన కుమార్తె రోహిణీకి ఉత్తర మహారాష్ట్రలోని ముక్తాయీనగర్ టికెట్ ఇచ్చింది కమలదళం. 1991 నుంచి ఈ స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు ఏక్నాథ్.
విద్యుత్‌శాఖ మంత్రి చంద్రశేఖర్ బావన్కులే సహా ఇతర సీనియర్ నేతలు ప్రకాశ్ మెహ్తా, రాజ్ పురోహిత్కూ ఈ జాబితాలో చోటు దక్కలేదు. విద్యాశాఖ మంత్రి తావడే బదులుగా బోరివలీ స్థానంలో ఈసారి సునీల్ రాణేను బరిలోకి దింపింది.
దక్షిణ ముంబయిలోని కోలాబా సిట్టింగ్ ఎమ్మెల్యే పురోహిత్ కంటే.. మహారాష్ట్ర శాసన మండలి ఛైర్మన్ రామ్రాజే నింబాల్కర్ అల్లుడు రాహుల్ నవ్రేకర్వైపే మొగ్గుచూపింది అధిష్ఠానం. మాజీ ఎన్సీపీ ఎమ్మెల్సీ నవ్రేకర్ ఇటీవలే భాజపాలో చేరి తాజాగా టికెట్ దక్కించుకోవడం విశేషం.