తెలంగాణ

telangana

By

Published : Jan 28, 2020, 4:28 PM IST

Updated : Feb 28, 2020, 7:21 AM IST

ETV Bharat / bharat

దిల్లీ దంగల్​: 'ఆప్​, భాజపా దొందూ దొందే'

దిల్లీ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ ఆరోపణలు, ప్రత్యారోపణలతో రాజధాని రాజకీయం రసవత్తరంగా మారింది. త్రిముఖ పోటీ నెలకొన్న నేపథ్యంలో కేంద్రంలో అధికారంలో ఉన్న భాజపా, రాష్ట్రంలో మళ్లీ గెలుపుకోసం ప్రయత్నిస్తున్న ఆప్​పై.. కాంగ్రెస్ వ్యూహం ఎలా ఉండబోతోంది? గత ఎన్నికల పోరులో రిక్త'హస్తం'తో వెనుదిరగ్గా.. ఈ సారి విజయావకాశాలు ఆ పార్టీకి ఎలా ఉన్నాయి.. ఏఏ హామీలతో ముందుకు సాగుతోంది. ప్రత్యర్థులను ఎలా ఎదుర్కోబోతోంది.. తదితర అంశాలపై 'ఈటీవీ భారత్'​తో ప్రత్యేకంగా ముచ్చటించారు కాంగ్రెస్​ పార్టీ దిల్లీ అధ్యక్షుడు సుభాష్​ చోప్రా.

bjp-brought-caa-to-divert-attention-from-economy-slowdown-subhash-chopra
ఆప్​, భాజపా దొందూ దొందే

2015 ఎన్నికల్లో దిల్లీలో ఒక్క సీటు కూడా గెలుచుకోని కాంగ్రెస్​కు ఇప్పుడు విజయావకాశాలు ఎలా ఉన్నాయి?

ఈసారి కాంగ్రెస్​ పార్టీ పూర్వ వైభవాన్ని సంతరించుకుంటుందని విశ్వసిస్తున్నాం.

ఆప్​, భాజపా దొందూ దొందే

దేని ఆధారంగా చెబుతున్నారు?

ఒకసారి గతంలోకి వెళితే.. 2013 అసెంబ్లీ ఎన్నికల సమయంలో అన్నా హజారే ఆధ్వర్యంలో అవినీతి నిరోధక ఉద్యమం నడిచింది. అప్పుడు జన్​ లోక్​పాల్​ బిల్లు తేవాలనే డిమాండ్​ గట్టిగా వినిపించింది. అయితే ఎన్నికలు ముగిశాక ఏం జరిగింది? సీఎం అయిన కేజ్రీవాల్​ జన్​ లోక్​పాల్ విషయాన్ని విస్మరించారు. పైగా కేంద్రం, లెఫ్ట్​నెంట్ గవర్నర్ తనను ఏ పని చేయడానికి అనుమతించలేదని ఇన్ని సంవత్సరాలుగా కేజ్రీవాల్​ ఆరోపిస్తూ వస్తున్నారే తప్పా ఏమీ చేయలేదు.

ఈ ఎన్నికల్లో మీకు ప్రత్యర్థి భాజపానా? ఆమ్​ ఆద్మీ పార్టీనా?

ఆప్​, భాజపా దొందూ దొందే.. దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్​ భాజపా నిజమైన సోదరుడిలా వ్యవహరిస్తున్నారు.

అలా అని మీరు ఎలా చెప్పగలుగుతున్నారు?

గత ఏడాది హరియాణాలో భాజపా-జన్​నాయక్ జనతా పార్టీ కూటమి ప్రభుత్వం ఏర్పడటానికి పరోక్షంగా కేజ్రీవాల్​ కారణమయ్యారు. జేజేపీ చీఫ్ దుష్యంత్ చౌతాలాతో కూదిరిన ఒప్పందం ప్రకారమే అతడి తండ్రి అజయ్ చౌతాలాను అర్ధరాత్రి తిహార్ జైలు నుంచి విడుదల చేయించారు కేజ్రీవాల్. జైలు రికార్డులను పరిశీలిస్తే అజయ్ చౌతాలా విడుదలలో.. దిల్లీ హోంశాఖ ప్రమేయం ఉన్నట్లు స్పష్టంగా తెలుస్తుంది. ఈ విషయంలో తన హస్తం లేదని దిల్లీ హోంమంత్రి చెప్పినట్లయితే.. వారికి పరిపాలించే హక్కు లేదనేది నా అభిప్రాయం.

దిల్లీకి మూడుసార్లు సీఎంగా చేసిన షీలా దీక్షిత్​ పేరును ప్రచారాస్త్రంగా చేసుకున్నారు. అసలు కాంగ్రెస్​కు ఎందుకు ఓటెయ్యాలో మూడు కారణాలు చెప్పగలరా?

  • విద్యార్థులు దేశ భవిష్యత్తు. సీఏఏకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తున్న విద్యార్థులను పోలీసులను దారుణంగా కొట్టారు. జామియా మిలియా ఇస్లామియా విశ్వవిద్యాలయం, జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో ఆందోళనకర పరిస్థితులు చోటుచేసుకున్నాయి. వర్సిటీల్లోకి ప్రవేశించి విచక్షణారహితంగా వ్యవహరించారు. అయితే ప్రజలను రక్షించడం కోసం ఎన్నికైన సీఎం కేజ్రీవాల్​ ఆ సమయంలో ఏం చేశారు. విద్యార్థులను రక్షించలేని ప్రభుత్వానికి అధికారంలో ఉండే అర్హత లేదు.
  • దిల్లీ కాలుష్యాన్ని తగ్గిస్తానని కేజ్రీవాల్​ చెప్పారు. కానీ దేశ రాజధానిలో గత సంవత్సరం కాలుష్య కారణంగా శ్వాసకోశ వ్యాధుల బారిన పడి 58 మంది మరణించారు. పెరిగిన ఉల్లి ధరలతో ప్రజల ఇబ్బందులను చూశాం.
  • ప్రజలకు పరిశుభ్రమైన నీరు, గాలిని ఇవ్వలేని.. ఆహార పదార్థాల ధరలను తనిఖీ చేయలేని ప్రభుత్వానికి పాలించే హక్కు లేదు. అవే ఆయుధాలుగా మేం ప్రజల ముందుకు వెళ్తున్నాం. అలాగని ఆప్​ ప్రభుత్వం అసలేమీ చేయలేదని మేం చెప్పడం లేదు.

ఆప్​ ప్రకటించిన విద్యుత్​ హామీపై మీ అభిప్రాయం..?

ఆమ్​ఆద్మీ ప్రకటించిన ఉచిత విద్యుత్​ హామీ మోసపూరితమైంది. అయినా కేజ్రీవాల్​ 200యూనిట్ల వరకే విద్యుత్​ ఉచితం అని ప్రకటించారు. కానీ మేము 600 యూనిట్ల వరకు ఉచితం అని చెప్పాం. సబ్సిడీని ట్రాన్స్‌కో ద్వారా అమలు చేస్తామని కేజ్రీవాల్ ​ హామీ ఇచ్చారు. తర్వాత ప్రైవేటు సంస్థల ద్వారా సబ్సిడీని అందించాలని ఎందుకు అనుకుంటున్నారు. మేం గెలిస్తే చిన్న దుకాణాల నిర్వాహకులకు 200 యూనిట్ల వరకు వాణిజ్య ఛార్జీలను రద్దు చేస్తాం. రైతులకు ఉచిత విద్యుత్ అందిస్తాం. ఇవి దిల్లీలోని ప్రజలకు అత్యవసమైనవి. మేం తప్పుడు వాగ్దానాలు ఇవ్వబోం. ఏది చెబితే అది చెబుతాం. ఇంతకు ముందు కూడా చెప్పిందే చేశాం. ఒకప్పుడు నీరు, కరెంట్​ లేని దేశ దిల్లీని ప్రపంచంలోనే అత్యుత్తమ నగరంగా తీర్చిదిద్దాం. ఆస్పత్రులు, పాఠశాలలు, 5 విశ్వవిద్యాలయాల నిర్మాణం.. సీఎన్‌జీ, ఫ్లైఓవర్లు, మెట్రోను దిల్లీలో ఏర్పాటు చేసింది ఎవరు? కాంగ్రెస్​ ప్రభుత్వమే చేసింది. ప్రజలు మమ్మల్ని ఆశీర్వదిస్తే.. మళ్లీ అత్యుత్తమ నగరంగా దిల్లీని మారుస్తాం.

సీఏఏ వ్యతిరేక ఉద్యమంలో కేజ్రీవాల్​ పాల్గొనకపోవడం.. దిల్లీ ఎన్నికల్లో మీకు ప్రచారాస్త్రంగా మారిందా?

సీఏఏ అనేది జాతీయ సమస్య. ఒక కమ్యూనిటీకి సంబంధించినది కాదు. దాని ప్రభావం దిల్లీపై కూడా ఉంటుంది. ప్రతి పౌరుడికి నిరసన తెలిపే హక్కు ఉంది. దిల్లీలో కొట్టినట్లు ఎక్కడా విద్యార్థులపై లాఠీఛార్జీ జరగలేదు. దిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ఇటీవలే సీఏఏకు వ్యతిరేకంగా మాట్లాడారు. కానీ అంతకు ముందు విద్యార్థులు వీధుల్లో ఆందోళన చేస్తున్నప్పుడు, వారిపై పోలీసులు దాడి చేసినప్పుడు దిల్లీ సీఎం ఎందుకు స్పందించలేదు. ఆ విద్యార్థులే ఈ ఎన్నికల్లో కేజ్రీవాల్‌కు గుణపాఠం చెబుతారు.

కేంద్రం సీఏఏను ఎందుకు తీసుకొచ్చింది?

కేంద్రంలోని భాజపా సర్కారు ఆర్థిక మందగమనం నేపథ్యంలో ఉద్యోగాలను సృష్టించలేక.. అందరి దృష్టిని మళ్లించేందుకు సీఏఏను తెచ్చింది. పార్లమెంట్​ లోపల, వెలుపల సీఏఏను మేం వ్యతిరేకించాం. శాంతియుత నిరసనలకు మాత్రమే మద్దతు ఇచ్చాం. ఎక్కడా హింస చోటుచేసుకోలేదు. షాహీన్ బాగ్ వద్ద బైఠాయించిన మహిళలను చూసి గర్వపడుతున్నాం. మాకు అలాంటి మహిళలే కావాలి. నేను వారి ముందు తల వంచుతాను.

Last Updated : Feb 28, 2020, 7:21 AM IST

ABOUT THE AUTHOR

...view details