చేతిలో లాఠీ పట్టుకుని, ఈల వేస్తూ కనిపించే ట్రాఫిక్ పోలీసు ఆమడ దూరంలో ఉంటేనే.. అలికిడికి భయపడి పక్షులన్నీ తుర్రుమని ఎగిరిపోతాయి. కానీ, ఒడిశా మయూర్‌భంజ్‌లో ట్రాఫిక్ పోలీసుగా విధులు నిర్వర్తిస్తున్న సూరజ్ కుమార్ రాజ్ వస్తే మాత్రం పక్షులన్నీ ఆనందంతో.. ఆయనపై వచ్చి వాలిపోతాయి. పదేళ్లుగా వాటికి ఆహారం అందిస్తూ, బర్డ్‌మ్యాన్‌గా అందరి మన్ననలు పొందుతున్నాడు ఈ పోలీసు.
ఆకలి తీర్చేస్తాడు..
రోజు రోజుకూ ప్రకృతిని హరించేస్తున్న కాలుష్యం.. వీధుల్లో నిండిపోయిన విద్యుత్ తీగలు, సెల్‌ఫోన్ టవర్లు వెదజల్లే రేడియేషన్ అన్నీ కలిసి ఇప్పటికే ఎన్నో అరుదైన పక్షి జాతులను అంతం చేస్తున్నాయి. ఇక నగరాల్లో సరైన ఆహారం, నీరు లభించక మరెన్నో విహంగాలు మృత్యువాత పడుతున్నాయి. స్వేచ్ఛకు ప్రతిరూపాలైన పక్షులు ఇలా నేలరాలిపోతూంటే.. 52 ఏళ్ల సూరజ్ మనసు చలించింది. తన వంతుగా వాటికి గింజలు వేస్తూ పక్షి జాతిని కాపాడే ప్రయత్నం చేస్తున్నాడు.
వృత్తికి ట్రాఫిక్ పోలీసే అయినా.. నిత్యం విధిగా వేలాది కాకులు, పావురాల కడుపు నింపుతున్నాడీ బర్డ్‌మ్యాన్.
"పదేళ్లవుతోంది.. నేను నా దారిలో వెళ్తున్నప్పుడు ఓ పావురం నాపై వాలింది. అప్పటి నుంచే వాటికి నేను ఆహారం పెట్టడం ప్రారంభించాను. రోజూ ఉదయాన్నే గుడికి వెళ్తాను.. ఆ తరువాత వాటికి ధాన్యం గింజలు పెడతాను. ఆ తరువాతే డ్యూటీకి వెళ్తాను. ట్రాఫిక్ నియంత్రించడం నా విధి, అలాగే పావురాలకు ఆహారం పెట్టడం కూడా నా విధిగా మారింది. వాటిని చూడకపోతే ఆ రోజు నాకేమీ తోచదు."