అధునాతన బయో టాయిలెట్స్, హ్యాండ్‌హెల్డ్ షవర్స్, ఆక్సిజన్ సిలిండర్స్, పవర్ సాకెట్స్, మస్కిటో నెట్స్... ఇలా ఎన్నో సౌకర్యాలతో రైలు బోగీల్ని మినీ ఆస్పత్రులుగా మార్చింది భారతీయ రైల్వే. కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతూ, దేశవ్యాప్తంగా ఆస్పత్రులు కిటకిటలాడుతున్న సమయంలో రోగులను ఇవే ఆదుకుంటాయని భావించింది. కానీ... అధికారుల లెక్క తప్పింది. కరోనా వార్డుల్లో సరిపడా పడకలు లేకపోయినా... రైలు బోగీల్ని వినియోగించుకునేందుకు స్థానిక యంత్రాంగాలు ముందుకు రావడం లేదు.
సిద్ధంగా ఉన్నాయ్.. కానీ
దేశంలో కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతున్న నేపథ్యంలో రైల్వేశాఖ 5,321 నాన్ ఏసీ స్లీబర్ క్లాస్ కోచ్‌లను కొవిడ్ కేర్ లెవల్ 1 కేంద్రాలుగా మార్చింది. వీటిలో రోగ లక్షణాలు ఉన్నవారికి, పాజిటివ్‌గా నిర్ధరణ అయిన వారికి వేర్వేరుగా చికిత్స అందించడానికి కూడా ఏర్పాట్లు చేసింది.
రైల్వేశాఖ ఇప్పటి వరకు 5 రాష్ట్రాలకు 960 బోగీలను కేటాయించింది. ముఖ్యంగా దిల్లీకి 503, ఉత్తర్‌ప్రదేశ్‌కు 372 బోగీలు సమకూర్చింది. వీటిలో వైద్య సిబ్బంది విశ్రాంతి తీసుకోవడానికి ప్రత్యేకంగా రెండు లేదా అంతకు మించి ఏసీ కోచ్‌లు కూడా ఏర్పాటుచేసింది. అయితే వీటిని తీసుకెళ్లేవారు లేకుండా పోయారు.