తల్లిదండ్రులు, వృద్ధుల సంక్షేమ చట్ట సవరణ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టింది కేంద్ర ప్రభుత్వం. ఈ చట్ట సవరణ ద్వారా.. వృద్ధులను దూషించేవారిపై ఆరు నెలల జైలుశిక్ష, రూ. 10వేల జరిమానా విధించేందుకు ప్రతిపాదిత చట్టం ద్వారా ప్రభుత్వం ఉద్దేశించినట్లు దిగువ సభలో వెల్లడించారు సామాజిక న్యాయం, సాధికారత మంత్రి థావర్‌చంద్ గహ్లోత్.
భౌతికంగా, మాటల ద్వారా, మానసికంగా, ఆర్థికపరమైన దాడులు చేయడం నిర్లక్ష్యం చేయడం, విడిచిపెట్టడం వంటి చర్యలను నేరాలుగా పరిగణించే నిబంధనలను ప్రతిపాదిత చట్టంలో పొందుపరచింది కేంద్రం. 'పిల్లలు' అనే పదానికి నిర్వచనాన్ని సైతం బిల్లులో ఉంచింది. సొంత సంతానం, దత్తత ద్వారా, సవతి సంతానం, అల్లుడు, కోడలు, మనవడు, మనవరాళ్లు, మైనర్ల చట్టపరమైన సంరక్షకులను పిల్లలుగా పేర్కొంది.