ఎస్పీజీ చట్ట సవరణ బిల్లును వచ్చేవారం లోక్‌సభలో ప్రవేశపెట్టనున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. మాజీ ప్రధాన మంత్రుల కుటుంబ సభ్యులకు ప్రత్యేక రక్షణ దళం (ఎస్పీజీ) కమాండోల భద్రత కల్పించరాదని ఈ బిల్లులో పేర్కొన్నట్లు తెలిపాయి. స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ చట్టాన్ని సవరిస్తూ రూపొందించిన బిల్లును ఇటీవలే కేంద్రమంత్రివర్గం ఆమోదించినట్లు చెప్పాయి.
కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీకి ఎస్పీజీ భద్రత తొలగింపు నేపథ్యంలో ఈ చట్ట సవరణ చేస్తోంది కేంద్రం.
ప్రస్తుత చట్టం ఇలా...
స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ చట్టం ప్రకారం ప్రధానమంత్రి, మాజీ ప్రధాని సహా వారి కుటుంబాలకు ఎస్పీజీ రక్షణ కల్పిస్తారు. మాజీ ప్రధాని కుటుంబ సభ్యులకు.. పదవి నుంచి తప్పుకున్న ఏడాది కాలం వరకు, ముప్పు పొంచి ఉందన్న అంచనాలతో అంతకుమించిన సమయం ఈ ప్రత్యేక భద్రతను ఇప్పటివరకు కల్పిస్తున్నారు.