కరోనా మహమ్మారి కారణంగా అంతర్జాతీయ సర్వీసులు నిలిచిపోయిన వేళ.. అమెరికా, ఫ్రాన్స్ దేశాలతో భారత్ కీలక ఒప్పందం చేసుకుంది. ఈ రెండు దేశాలతో విమాన సేవలకు సంబంధించి ద్వైపాక్షిక ఒప్పందం కుదుర్చుకుంది. దీంతో ఒప్పందం కుదిరిన దేశాలు తమ విమాన సర్వీసులను నడపనున్నాయి. శుక్రవారం నుంచే ఈ విమాన సేవలు ప్రారంభం కానున్నాయని కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి హర్దీప్‌సింగ్ పురి వెల్లడించారు.
ఈ ఒప్పందం ప్రకారం అమెరికాకు చెందిన యునైటెడ్ ఎయిర్‌లైన్స్ జులై 17 నుంచి 31 మధ్య 18 విమానాలను నడపనుంది. ఎయిర్ ఫ్రాన్స్ సైతం జులై 18 నుంచి ఆగస్టు 1 మధ్య 28 విమానాలను నడపనుందని పురి వెల్లడించారు. దిల్లీ-న్యూయార్క్ మధ్య ప్రతిరోజూ, దిల్లీ- శాన్‌ఫ్రాన్సిస్కో మధ్య వారానికి మూడు రోజుల పాటు విమానాలు నడవనున్నాయని తెలిపారు. భారత్ నుంచి ఎయిర్‌ఇండియా ఈ రెండు దేశాలకు విమానాలను నడపనుంది.
దిల్లీ-లండన్ మధ్య రోజుకు రెండు చొప్పున విమానాలు నడిపేందుకు బ్రిటన్‌తో ఒప్పందం చేసుకోబోతున్నట్లు హర్దీప్‌సింగ్ తెలిపారు. జర్మనీ నుంచి కూడా వినతులు వచ్చాయని, లుఫ్తాన్సా ఎయిర్‌లైన్స్‌తో ఆ మేరకు ఒప్పందం దాదాపు ఖరారైనట్లు తెలిపారు. ఈ తరహా ఒప్పందానికి ఇతర దేశాల నుంచి కూడా పెద్ద ఎత్తున వినతులు వస్తున్నప్పటికీ ఆచితూచి అడుగువేస్తున్నామని చెప్పారు.
కరోనా వైరస్ కారణంగా దేశంలో మార్చి 23 నుంచి అంతర్జాతీయ విమాన సేవలు నిలిచిపోయాయి. రెండు నెలల తర్వాత మే 25న కేవలం దేశీయ విమాన సేవలు మాత్రమే ప్రారంభమయ్యాయి. అలాగే విదేశాల్లో చిక్కుకున్న భారతీయుల కోసం కేంద్ర ప్రభుత్వం వందేభారత్ మిషన్ పేరిట విమానాలను నడిపింది. కొవిడ్-19 కారణంగా అంతర్జాతీయంగా విమాన సేవలపై ఆంక్షలు కొనసాగుతున్న వేళ విమాన సర్వీసులు నడిపేందుకు ఇతర దేశాలతో భారత్ ఒప్పందం చేసుకుంది.
ఇదీ చూడండి:మహారాష్ట్రలో ఒక్కరోజే 8,641 కేసులు.. 266 మరణాలు