ఆర్జేడీ హయాంలో జరిగిన నేరాలే లక్ష్యంగా బిహార్ సీఎం నితీశ్‌కుమార్ ఎన్నికల ప్రచారంలో ఆ పార్టీపై విరుచుకుపడ్డారు. బక్సర్‌లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన భాజపా నేత, డిప్యూటీ సీఎం సుశీల్‌మోదీతో కలిసి సంయుక్తంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారిద్దరూ ఆర్జేడీ పాలనలోని నేరాల స్థాయిని లక్ష్యంగా చేసుకుని ఆ పార్టీపై విమర్శలు ఎక్కుపెట్టారు. గతంలోని ఆర్జేడీ 15 ఏళ్ల పాలనకు, తమ హయాంకు మధ్య తేడాల్ని ప్రజలకు వివరించారు. అభివృద్ధి పనులు వేగవంతం అయ్యేందుకు మరోసారి ఎన్డీయే కూటమికి పట్టం కట్టాలని ఓటర్లను కోరారు.
"గతంలో ఆర్జేడీ పాలనలో ఆటవిక రాజ్యం ఉండేది. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావాలంటే బయపడి పోయేవారు. ఇప్పుడు చట్టబద్ధమైన పాలన నడుస్తోంది. సొంత ప్రయోజనాల కోసం కృషి చేసిన వారు ఇప్పుడు జైళ్లలో ఉన్నారు."
-- నితీశ్ కుమార్, బిహార్ ముఖ్యమంత్రి
"నితీశ్ హయాంలో ప్రభుత్వం కరోనా వైరస్‌ను సమర్థంగా ఎదుర్కొంది. కాంగ్రెస్ భాగస్వామ్యంతో పాలిస్తున్న మహారాష్ట్రలో కరోనా కారణంగా దాదాపు 40వేల మంది మరణించారు. ఇక్కడ ఎన్డీయే ప్రభుత్వం సరైన నిర్వహణ చేపట్టినందుకు మరణాలు వేయికి పరిమితమయ్యాయి. బిహార్‌లో కరోనా వైరస్ రికవరీ రేటు 94శాతం ఉంది."
-- సుశీల్ మోదీ, బిహార్ ఉప ముఖ్యమంత్రి
బక్సర్ నియోజకవర్గానికి ఎన్డీఏ కూటమి తరపున భాజపా అభ్యర్థి పరశురాం చతుర్వేది బరిలో ఉన్నారు. కాగా బిహార్ డీజీపీ పదవికి రాజీనామా ప్రకటించి జేడీయూలో చేరిన గుప్తేశ్వర్ పాండే పోటీ చేయాలనుకున్నారు. కానీ కూటమిలో భాగంగా ఆ స్థానం భాజపాకు కేటాయించారు. ఈ రోజు నిర్వహించిన సంయుక్త ప్రచార కార్యక్రమానికి సైతం గుప్తేశ్వర్ హాజరు కాకపోవడం గమనార్హం. బిహార్ శాసనసభకు అక్టోబర్ 28న తొలి విడత ఎన్నికలు జరగనున్నాయి.
ఇదీ చూడండి:థరూర్ వ్యాఖ్యలపై కాంగ్రెస్-భాజపా మాటల యుద్ధం