కోరలు చాస్తున్న కరోనాను తరిమికొట్టేందుకు ప్రపంచ దేశాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. కొవిడ్-19ను జయించేందుకు సామాజిక దూరం, శానిటైజేషన్ మాత్రమే మన చేతుల్లో ఉన్న అస్త్రాలని వైద్యులు తేల్చి చెబుతున్నారు. కానీ, ఇన్నాళ్లు ఏ భయం లేకుండా విహరించిన మానవాళికి ఉన్నట్టుండి ఈ కొత్త అలవాట్లు పాటించడం కాస్త కష్టమే! అందుకే, దీనికి పరిష్కారంగా ప్రత్యేక గొడుగును రూపొందించాడు బిహార్‌కు చెందిన వినీత్. ఈ గొడుగు మీ వద్ద ఉంటే చాలు, సామాజిక దూరం, శానిటైజేషన్ దానంతటదే వంటపడుతుందంటున్నాడు.
కాపాడే కవచం..
ఔరంగాబాద్ జిల్లా డెహ్రా గ్రామానికి చెందిన మనీశ్ ప్రజాపతి కుమారుడు వినీత్. ఇదివరకు ప్లాస్టిక్‌తో పెట్రోల్ తయారు చేసి చరిత్ర సృష్టించాడు ఈ యువ శాస్త్రవేత్త. ఇప్పుడు కరోనాపై పోరాటంలో తనదైన శైలిలో పరిష్కారం చూపుతున్నాడు.
వినీత్ రూపొందించిన ఈ గొడుగును తెరవగానే శానిటైజర్‌పై ఒత్తిడి పడుతుంది. తద్వారా శానిటైజర్‌కు అమర్చిన పైపుల ద్వారా అది చేతులకు చేరుతుంది. అలా బయటికి వెళ్లిన ప్రతి సారి మనం మర్చిపోయినా, చేతులను శుభ్రం చేసేస్తుందీ గొడుగు. పైగా దీని చుట్టూ ఓ ప్లాస్టిక్ కవర్ ఉంటుంది, ఇది సామాజిక దూరం పాటించడానికి దోహదపడుతుంది.