ఒక రాష్ట్రానికి అప్రతిహతంగా 15 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన ఆయన ఏనాడూ తన నియోజకవర్గంలో ప్రచారం చేసుకోలేదు. కనీసం ఓటేయాలని కూడా ఎవరినీ అడగలేదు. కానీ ప్రజలు మాత్రం ఆయనను గెలిపిస్తూనే ఉండేవారు. గుండెల్లో పెట్టుకుని ఆరాధించేవారు. నిబద్ధతతో ప్రజల కోసం పనిచేస్తే వారే ఓట్లు వేస్తారన్న ఆయన సిద్ధాంతం ఎనాడూ ఓడిపోలేదు. సమున్నత విలువలను నమ్ముకుని ప్రజలకు సుపరిపాలన అందించిన ఆయనే బిహార్ తొలి ముఖ్యమంత్రి శ్రీకృష్ణ సిన్నా అలియాస్ శ్రీబాబు.
భారత జాతీయ కాంగ్రెస్‌కు చెందిన ఆయన, నాటి తరం నేతల్లో నిబద్ధత, ప్రజాసేవపై ధ్యాస ఎలా ఉండేవో చెప్పడానికి చక్కని ఉదాహరణ. రాష్ట్రానికి అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న వేళ.. శ్రీబాబు వ్యక్తిత్వం రాజకీయ నేతలందరికీ ఆదర్శప్రాయం.
పారిశ్రామిక విప్లవం ఆయన హయాంలోనే
ఒకటిన్నర దశాబ్దాల పాటు(1946-1961) బిహార్ ముఖ్యమంత్రిగా పనిచేసిన శ్రీబాబు.. రాష్ట్ర అభివృద్ధికి ఎంతో చేశారు. రాష్ట్రంలో తొలి పారిశ్రామిక విప్లవం ఆయన హయాంలోనే సాధ్యమైంది. బిహార్‌కు ఎన్నో ప్రముఖ పరిశ్రమలను తీసుకొచ్చిన ఘనత ఆయనది. గ్రామీణాభివృద్ధికి పెద్దపీట వేసిన ఆయన వ్యవసాయ రంగానికీ విశేష ప్రాధాన్యం ఇచ్చారు. ఆధునిక బిహార్ రూపశిల్పిగా, బిహార్ కేసరిగా ఆయనకు పేరుంది. ఎన్నికల సమయంలో ఆయన ఓట్లు అడిగేందుకు తన నియోజకవర్గానికి వెళ్లేవారు కాదు. "నేను ప్రజల అభివృద్ధి కోసం పనిచేస్తే.. వారిని అడగకపోయినా నాకే ఓటేస్తారు." అని చెప్పేవారు.
సుపరిపాలన ఆనాడే
బిహార్‌లోని నవాడా జిల్లా ఖన్వా గ్రామంలో 1887లో జన్మించిన ఆయన సామాన్య ప్రజానీకం నుంచి పుట్టిన నేత. ముఖ్యమంత్రిగా ఉ్నన సమయంలో ఎప్పుడైనా తన గ్రామానికి వెళితే భద్రత సిబ్బందిని ఊరవతలే ఉండమని చెప్పేవారు. సాదాసీదా జీవితం గడుపుతూ ప్రజల మధ్యనే ఉండేవారు. బిహార్ జమీందారీ వ్యవస్థను పూర్తిగా రూపుమాపిన ఘనత ఆయనకే దక్కుతుంది. ఇప్పుడు దేశవ్యాప్తంగానే కాదు.. ప్రపంచవ్యాప్తంగానూ ప్రతి ఒక్కరూ సుపరిపాలన గురించి మాట్లాడుకుంటున్నారు. కానీ శ్రీబాబు దీన్ని ఆనాడే అందించారు. ఆయన 1961లో కన్నుమూశారు.
ఇదీ చదవండి-ఆన్లైన్లో 'ఏఐ' పాఠాలు.. గిన్నిస్ బుక్‌లో చోటు