బిహార్ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ ప్రచార అస్త్రాలకు పదును పెడుతున్న భారతీయ జనతా పార్టీ.. పలు హామీలతో ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది. పట్నాలో జరిగిన కార్యక్రమంలో ఎన్నికల ప్రణాళికను కేంద్ర ఆర్థిక మంత్రి, భాజపా నేత నిర్మలాసీతారామన్ విడుదల చేశారు. ఈ సందర్భంగా.. రాష్ట్రంలో 19 లక్షల ఉద్యోగాల కల్పనతో పాటు.. బిహార్ ప్రజలందరికీ కొవిడ్-19 వ్యాక్సిన్ ఉచితంగా అందిస్తామని హామీ ఇచ్చారు. తమ మేనిఫెస్టోలో ఇదే తొలి హామీగా పొందుపరిచామన్నారు నిర్మలా.
" రాజకీయంగా ప్రజలకు పూర్తిస్థాయిలో అవగాహన ఉన్న రాష్ట్రాల్లో బిహార్ ఒకటి. ఒక పార్టీ ఇచ్చే హామీలను తెలుసుకుని, అర్థం చేసుకుంటారు. ఎవరైనా మా మేనిఫెస్టోపై ప్రశ్నలు లేవనెత్తితే.. గతంలోని వాగ్ధానాలను నెరవేర్చిన పూర్తి విశ్వాసంతో సమాధానం ఇస్తాం. ఎన్డీఏ హయాంలో బిహార్ జీడీపీ గణనీయంగా పెరిగింది. 15 ఏళ్ల మా పాలనలో అది 3 శాతం నుంచి 11.3 శాతానికి చేరింది. ప్రజలకు మంచి పాలన అందించాలనే మా ప్రభుత్వ ప్రాధాన్యాలతోనే ఇది సాధ్యమైంది. "
- నిర్మలా సీతారామన్, కేంద్ర ఆర్థిక మంత్రి.