బిహార్ రెండో దఫా ఎన్నికల సమరం దేశంలోని రాజకీయవర్గాలను ప్రత్యేకంగా ఆకర్షిస్తోంది. రెండో దశలో పోలింగ్ జరిగే 94 స్థానాల్లో కీలకమైన అభ్యర్థులు బరిలో ఉండటం ఆసక్తి రేపుతోంది. బడా రాజకీయ నేతలు, తలపండిన సీనియర్లు, సీఎం అభ్యర్థిగా పరిగణిస్తున్నవారు పోటీ చేస్తున్న నియోజకవర్గాల్లో రెండో దశలోనే పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో రెండో దశ ఎన్నికకు అత్యంత ప్రాధాన్యం ఏర్పడింది.
రెండో దశలో బరిలో నిలిచిన పది మంది ప్రధాన అభ్యర్థుల వివరాలు ఇలా ఉన్నాయి..
1. తేజస్వీ యాదవ్, రాఘోపుర్
బిహార్ ఎన్నికల్లో మహాకూటమి తరపున అన్నీ తానై నడిపిస్తున్నారు మాజీ ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్. ప్రస్తుతం రాఘోపుర్ నియోజకవర్గం నుంచి బరిలో ఉన్నారు. 2015 ఎన్నికల్లో ఇక్కడి నుంచే పోటీ చేసి విజయఢంకా మోగించారు. భాజపా నేత సతీష్ కుమార్‌పై గెలుపొందారు. రాఘోపుర్ నియోజకవర్గం రాష్ట్రీయ జనతా దళ్(ఆర్జేడీ)కి కంచుకోట. ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్, ఆయన సతీమణి రబ్రీ దేవి.. 1995 నుంచి 2010 వరకు ఈ నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహించారు. 2010లో జేడీయూ సతీష్ కుమార్ చేతిలో రబ్రీ దేవి ఓడిపోయారు. తర్వాతి ఎన్నికల్లో జేడీయూ టికెట్ ఇవ్వకపోవడం వల్ల భాజపాలో చేరిన సతీశ్.. తేజస్వీ చేతిలో ఓటమి చవిచూశారు.
2. తేజ్ ప్రతాప్ యాదవ్, హసన్‌పుర్
గతంలో మహువా నుంచి పోటీ చేసిన లాలూ రెండో కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్.. ప్రస్తుతం హసన్‌పుర్ నుంచి బరిలోకి దిగుతున్నారు. ఈ నియోజకవర్గంలో యాదవులు, ముస్లిం ఓటర్లు అధికంగా ఉన్నారు. జేడీయూ సిట్టింగ్ ఎమ్మెల్యే రాజ్ కుమార్ రేతో పోటీ పడనున్నారు తేజ్ ప్రతాప్.
3. పుష్పమ్ ప్రియా చౌధరీ, బంకిపోరె
జేడీయూ నేత వినోద్ చౌధరీ కూతురే ఈ పుష్పమ్ ప్రియా చౌధరీ. పట్న జిల్లాలోని బంకిపోరె స్థానం నుంచి బరిలో ఉన్నారు. ప్లూరల్స్ పార్టీని స్థాపించి బిహార్ రాజకీయ క్షేత్రంలోకి అడుగుపెట్టిన ఆమె.. గత కొన్ని నెలలుగా సీఎం నితీశ్ కుమార్‌కు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారు. బిహార్‌లో భారీ మార్పులు రావాలంటూ గళమెత్తుతున్నారు. భాజపా ఎమ్మెల్యే నవీన్, కాంగ్రెస్ నేత లవ్ సిన్హా ఈ స్థానం నుంచి పోటీ పడుతున్నారు.
4. లవ్ సిన్హా, బంకిపోరె
పట్నా జిల్లాలో ఉన్న ఈ నియోజకవర్గం అత్యంత కీలకమైన స్థానం. ఇక్కడి నుంచి భాజపా మాజీనేత శత్రుఘ్న సిన్హా కుమారుడు లవ్ సిన్హా పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ తరపున బరిలోకి దిగారు. 2006 నుంచి ఈ స్థానానికి భాజపా నేత నితిన్ నాబిన్ ప్రాతినిథ్యం వహిస్తున్నారు. అంతకుముందు నితిన్ తండ్రి నాబిన్ కిషోర్ ప్రసాద్ సిన్హా ఈ నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహించారు. 2015లో జరిగిన ఎన్నికలో నితిన్ నాబిన్ దాదాపు 40 వేల ఓట్ల తేడాతో కాంగ్రెస్ అభ్యర్థిపై గెలుపొందారు.
లవ్ సిన్హా పలు సినిమాల్లోనూ కనిపించారు. 2010లో వచ్చిన హిందీ చిత్రం సదియా చిత్రంతో తెరంగేట్రం చేసిన ఆయన.. చివరి సారి పల్టాన్ సినిమాలో కనువిందు చేశారు.
5. పప్పు యాదవ్, మధేపురా
జన్ అధికార్ పార్టీ-లోక్తాంత్రిక్ అధినేత రాజేశ్ రంజన్ అలియాస్ పప్పు యాదవ్... మధేపుర స్థానం నుంచి బరిలో ఉన్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే, ఆర్జేడీ నేత చంద్రశేఖర్, జేడీయూ నేత నిఖిల్ మండల్లతో పోటీ పడనున్నారు.