బిహార్ రాజకీయాలు ఎప్పుడూ రసవత్తరంగానే ఉంటాయి. అవకాశవాద రాజకీయ కూటములు, కుటుంబ కలహాలు, ప్రత్యర్థులపై కక్ష సాధింపులు.. అందుకే బిహార్ గడ్డపై రాజకీయాలకు అడ్డా. వీటన్నింటికి మించి రసకందాయకంగా ఉంటుంది ఎన్నికల నిర్వహణ. బిహార్‌లో స్వేచ్ఛగా, సక్రమంగా ఎన్నికలు పూర్తిచేయటం.. నిర్వాచన్ సదన్ సామర్థ్యానికి పరీక్ష పెడుతుంటుంది. ఈసారి అంతకుమించిన మరో సవాల్.. కొవిడ్ మహమ్మారి నుంచి ఎదురవుతోంది. ఈ నేపథ్యంలోనే బిహార్‌లో ఎన్నికల నగారా మోగింది.
నాడు ఏమైంది?
గత (2015) అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ), జేడీయూ, కాంగ్రెస్ పార్టీలు మహాఘట్ బంధన్ (మహా కూటమి)గా ఏర్పడి బరిలోకి దిగాయి. 243 అసెంబ్లీ స్థానాలకు గాను దాదాపు 180 వరకు దక్కించుకున్నాయి. అత్యధికంగా ఆర్జేడీ 80 సీట్లు సాధించింది. అయితే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించిన నితీశ్ కుమార్ రెండేళ్ల తర్వాత మహా కూటమి నుంచి బయటకొచ్చి.. భాజపా మద్దతుతో తిరిగి అధికారం చేపట్టారు. ఇలా అత్యధిక స్థానాల్లో విజయం సాధించినా ఆర్జేడీ ప్రతిపక్షంలోనే కూర్చోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
జేడీయూ సారథ్యంలో ఎన్డీఏ
విపక్షాలతో పాటు కూటమిలోని భాగస్వామ్య పక్షం నుంచి ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌కు ఇబ్బందులు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన, పథకాలను ప్రచారం చేసుకుంటూ పక్కా వ్యూహం రచించారు. ఎన్నికల నిబంధనావళి అమల్లోకి రాకముందే గత రెండు నెలల్లో వేలాది కోట్ల రూపాయల విలువ చేసే పనులను ప్రారంభించారు. ఎన్డీఏ కూటమిలోని భాజపా కూడా నితీశ్‌కే ప్రాధాన్యం ఇస్తోంది. మూడు దఫాలు బిహార్ సీఎంగా పని చేసిన నితీశ్‌నే.. నాలుగోసారి ముఖ్యమంత్రి అభ్యర్థిగా పెట్టనుంది ఎన్డీఏ. మహాకూటమి ఏర్పాటై ఆర్జేడీ 140 స్థానాలకు పైగా పోటీలో దిగితే... ఎన్డీఏకు గట్టి పోటీ తప్పదు.
ఎల్‌జేపీ ఒంటరిగానే పోటీ.?
బిహార్ ఎన్డీఏలో అసమ్మతి పెరగడం, సీట్ల కేటాయింపుల్లో పొత్తు కుదరకపోవడం సహా నిన్న మొన్నటి వరకు ఎన్డీఏ వ్యతిరేక కూటమిలో ఉన్న మాజీ సీఎం జీతన్‌రాం మాంఝీ నేతృత్వంలోని హిందుస్థానీ అవామ్ మోర్చా (హెచ్‌ఏఎం).. జేడీయూతో పొత్తు పెట్టుకోవడం ఎన్డీఏ భాగస్వామ్య పార్టీ అయిన లోక్ జనశక్తి పార్టీ (ఎల్‌జేపీ)కి నచ్చడం లేదు. అందుకే ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేయనుంది.
బిహార్ సీఎం నితీశ్ కుమార్ నేతృత్వంలోని జేడీయూ పోటీ చేసే 143 స్థానాల్లో.. తమ అభ్యర్థులను బరిలోకి దింపాలని ఎల్‌జేపీ జాతీయ అధ్యక్షుడు చిరాగ్ పాసవాన్ భావిస్తున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. 2019 లోక్‌సభ ఎన్నికల్లో 6 సీట్లలో పోటీ చేసిన ఎల్‌జేపీ.. అన్ని సీట్లలోనూ గెలిచింది.
జేడీయూ నుంచి వేరుపడి హెచ్‌ఏఎంను స్థాపించిన జీతన్ రాం మాంఝీ మొన్నటి వరకు కాంగ్రెస్-ఆర్జేడీ కూటమిలో ఉన్నారు. ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ వైఖరి గిట్టక ఆ కూటమికి 'రాం రాం' చెప్పారు. ఈ ఎన్నికల ముంగిట జేడీయూతో పొత్తు పెట్టకున్నారు మాంఝీ. మగధ ప్రాంతంలో 15-20 నుంచి సీట్లు ఆ పార్టీ ఆశిస్తోంది. జేడీయూ మాత్రం 10-12 సీట్లు ఇవ్వాలని భావిస్తోంది. గత ఎన్నికల్లో పోటీ చేసిన హెచ్‌ఏంఎకు వచ్చింది ఒక్కసీటే కావడం గమనార్హం.
బిహార్‌లో 243 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. అందులో 40 సీట్లు ఎస్సీ రిజర్వ్డ్. రాష్టంలో దళితుల ఓట్లు 16శాతం. అంటే రిజర్వ్డ్ స్థానాల్లో కాకుండా మిగతా చోట్ల కూడా వారు కీలకంగా మారనున్నారు. వీటిని పొందేందుకు జీతన్ రాం మాంఝీ, పాసవాన్ మధ్య గట్టిపోటీ ఉండనుంది.
మహాకూటమికి సవాళ్లు..