తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'మూడింట రెండొంతుల మెజార్టీ పక్కా'

బిహార్​ అసెంబ్లీ ఎన్నికలకు ముందు మహాకూటమి విజయంపై​ సీఎం అభ్యర్థి తేజస్వీ యాదవ్​ ధీమా వ్యక్తం చేశారు. తమ కూటమికి మూడింట రెండొంతుల మేజారిటీ తథ్యమన్నారు. ఎన్నికల్లో విజయం సహా మరిన్ని విషయాలపై తన అభిప్రాయాలను వెల్లడించారు తేజస్వీ.

Tejaswi
తేజస్వీ

By

Published : Oct 27, 2020, 5:34 PM IST

బిహార్​ శాసనసభ ఎన్నికల్లో మహాకూటమి​ మూడింట రెండొంతుల మెజారిటీ సాధిస్తుందని ధీమా వ్యక్తంచేశారు ఆర్​జేడీ నేత తేజస్వీ యాదవ్​. అధికారంలోకి వచ్చాక యువతకు ఉద్యోగాలు కల్పించడమే తమ తొలి ప్రాధాన్యమని తెలిపారు. ఇటీవల కేంద్ర తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాల్ని వ్యతిరేకిస్తూ రాష్ట్రంలో నూతన చట్టాలను తొలి అసెంబ్లీ సమావేశాల్లోనే తీసుకువస్తామన్నారు.

ఇన్నాళ్ల తమ కృషి నవంబర్​ 10న ఫలిస్తుందని తేజస్వీ ఆశాభావం వ్యక్తం చేశారు. ఆ రోజు బిహార్​ ప్రజలు సరికొత్త చరిత్రను లిఖిస్తారన్నారు. ఉద్యోగ కల్పన సహా మరిన్ని విషయాలపై పీటీఐ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వూలో కీలక వ్యాఖ్యలు చేశారు.

"బిహార్​ యువతకు 10 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇవ్వడం చరిత్రలో ఇదే తొలిసారి. అధికారంలోకి వస్తే తొలి కేబినెట్​ భేటీలోనే దీనికి ఆమోదం తెలుపుతాం. ప్రజల ఆశీర్వాదం, మద్దతు మాకుందని ఎన్నికల ప్రచారంలో అర్థమైంది. మాపై పెద్ద బాధ్యతను ఉంచడానికి వాళ్లు నిర్ణయం తీసుకున్నారు. మా కూటమి మూడింట రెండొంతుల మెజార్టీ సాధించడం తథ్యం. చాలా నియోజకవర్గాల్లో ఎన్​డీఏ అభ్యర్థులకు డిపాజిట్లు గల్లంతవుతాయి. నవంబర్​ 10న చూడండి. బిహార్​ సరికొత్త నేతను చూస్తుంది."

- తేజస్వీ యాదవ్​, మహాకూటమి​ సీఎం అభ్యర్థి

నితీశ్​పై విమర్శలు...

15 ఏళ్ల పాలనలో నితీశ్..​ విద్యా, ఉద్యోగం, ఆరోగ్యం వంటి కీలక రంగాలను నిర్లక్ష్యం చేశారని తేజస్వీ ఆరోపించారు. తాము అధికారంలోకి వస్తే వీటిపైనే ఎక్కువగా దృష్టి సారిస్తామన్నారు.

చిరాగ్​తో దోస్తీపై...

లోక్ జనశక్తి పార్టీ అధినేత చిరాగ్​ పాస్​వాన్​తో ఎన్నికల అనంతరం పొత్తు పెట్టుకునే అవకాశం ఉందా అన్న ప్రశ్నను తేజస్వీ కొట్టిపారేశారు. నితీశ్​ కుమార్​ స్థానంలో భాజపా అభ్యర్థిని సీఎంగా కూర్చోబెట్టేందుకే పాస్​వాన్ ప్రయత్నిస్తున్నారని తెలిపారు.

మోదీ ప్రచారంపై...

మోదీ ప్రచారం ఎన్​డీఏ అభ్యర్థులకు కలిసివస్తుందన్న వ్యాఖ్యలను తేజస్వీ తోసిపుచ్చారు. పన్నెండున్నర కోట్ల బిహార్​ జనాభా ఇప్పటికే ఒక నిర్ణయం తీసుకున్నారన్నారు. నిరుద్యోగం, వలసవాదం, అవినీతి, పేదరికం వంటి అంశాలనే దృష్టిలో పెట్టుకునే ప్రజలు ఓటు వేస్తారని అభిప్రాయపడ్డారు.

బిహార్​ శాసనసభ సమరం మూడు దశల్లో జరగనుంది. తొలి దశ పోలింగ్​ బుధవారం అవుతుంది. నవంబర్​ 10న ఫలితాలు వెలువడనున్నాయి.

ABOUT THE AUTHOR

...view details