బిహార్ ఎన్నికల ప్రచారంలో ప్రధాని నరేంద్రమోదీ, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ శుక్రవారం నుంచి పాల్గొననున్నారు. ఇద్దరు అగ్రనేతలు రాష్ట్రానికి రానున్న నేపథ్యంలో బిహార్ రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఇద్దరు నేతలు వరుస బహిరంగ సభల్లో పాల్గొననున్నారు.
డెహ్రీ ఆన్‌సోన్, గయా, భగల్పుర్ తదితర ప్రాంతాల్లో పర్యటించనున్న మోదీ.. ఎన్డీఏ తరఫున ప్రచారం చేయనున్నారు. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ గురువారం ఓ సందేశాన్ని ఇచ్చారు మోదీ. ఎన్డీఏ అభివృద్ధి ఎజెండాను ప్రకటించి, దానికి ప్రజల మద్దతు కోరుతానని స్పష్టం చేశారు.
డెహ్రీ, భగల్పుర్ సభల్లో బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కూడా మోదీతో పాటు పాల్గొననున్నట్లు తెలుస్తోంది. గయాలో జేడీయూ లోక్‌సభాపక్ష నేత రాజీవ్ రంజన్ సింగ్ లల్లాన్, హిందూస్థానీ ఆవామ్ మోర్చా అధ్యక్షుడు జీతన్ రామ్ మాంఝీ.. మోదీతో కలిసి ప్రచారంలో పాల్గొంటారు.
రెండు చోట్ల రాహుల్..
రాహుల్ గాంధీ కూడా శుక్రవారం నుంచే బిహార్ ఎన్నికల ప్రచారం మొదలుపెట్టనున్నారు. నవాదా జిల్లాలోని హిసువా, భగల్పుర్లోని కహల్గావ్ సభల్లో పాల్గొంటారు. మహాకూటమి సీఎం అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్.. హిసువా సభకు హాజరుకానున్నారు. కహల్గావ్లో శక్తి సింగ్ గోహిల్ సహా ఇతర సీనియర్ కాంగ్రెస్ నేతలు ప్రచారం చేయనున్నారు.