"బిహార్‌లో నేటి నుంచి అన్ని రకాల మద్యంపై నిషేధం విధిస్తున్నాం. హోటళ్లు, బార్లు, క్లబ్‌లు, ఇతర ప్రదేశాల్లో మద్యం అమ్మడం, తాగడం చట్టవ్యతిరేకం."
-2016 ఏప్రిల్ 5న సీఎం నితీశ్ ప్రకటన
బిహార్‌లో సంపూర్ణ మద్యపాన నిషేధం విధించి నాలుగేళ్లు గడిచాయి. ఇప్పుడు ఎన్నికలు వచ్చాయి. మరి బిహార్‌లోని మహిళాలోకం నితీశ్‌కు మరోమారు జైకొడుతుందా? ఎన్డీఏకి పట్టం కడుతుందా? మహిళా ఓటు బ్యాంకుపై నితీశ్ గురిపెట్టిన ఇతర అస్త్రాలేంటి?
విజయంలో సగం!
బిహార్ ఎన్నికల్లో మహిళల పాత్ర చాలా కీలకం. జనాభాలో దాదాపు సగం ఉన్న వారికి రాజకీయంగా, ప్రభుత్వపరంగా పెద్దపీటే వేస్తారు. వారి అనుగ్రహం పొందితే ఎన్నికల్లో విజయం సునాయాసంగా వరిస్తుందనేది రాష్ట్రంలోని ప్రధాన పార్టీల నమ్మకం. దీన్ని మొదటినుంచి ముఖ్యమంత్రి నితీశ్ సైతం గట్టిగానే విశ్వసిస్తారు. అందుకే ప్రతి ఎన్నికల్లోనూ మహిళలకు సంబంధించిన ఏదో ఒక విషయాన్ని ప్రధాన ప్రచార అస్త్రంగా చేసుకుంటారు.
2010 ఎన్నికల నుంచే...
బిహార్ రాజకీయాల్లో మహిళల ప్రాధాన్యాన్ని తెలియచెప్పాయి 2010 శాసనసభ ఎన్నికలు. రాష్ట్ర చరిత్రలో తొలిసారి పురుషులకన్నా అధిక సంఖ్యలో పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చారు. ఆ ఎన్నికల్లో నితీశ్ విజయం సాధించేందుకు ప్రధాన కారణాల్లో మహిళల మద్దతు ఒకటన్నది విశ్లేషకుల మాట. ఏకంగా 37 మంది మహిళలకు శాసనసభకు ఎన్నికవడం, వారిలో జేడీయూ సభ్యులే ఎక్కువగా ఉండడం మరో విశేషం.
వాస్తవానికి 2005లో తొలిసారి ముఖ్యమంత్రి పదవి చేపట్టిన నాటి నుంచే మహిళా ఓటుబ్యాంకుపై గురిపెట్టారు నితీశ్. గ్రామ పంచాయతీల్లో 50శాతం రిజర్వేషన్ వంటి నిర్ణయాలతో మహిళా సాధికారతకు కృషిచేశారు. బాలికల విద్యపై ప్రత్యేక దృష్టి, విద్యార్థినులకు ప్రోత్సాహకాలు, ఉచితంగా పుస్తకాలు, దుస్తులు, సైకిళ్లు పంపిణీ వంటి కార్యక్రమాలతో సంక్షేమ మంత్రం జపించారు.