బిహార్‌లో వామపక్షాలు అస్థిత్వం కాపాడుకునేందుకు గట్టి ప్రయత్నమే చేస్తున్నాయి. ఎందుకంటే పరిస్థితులు గతంలోలాగా లేవు. ఏళ్లుగా ప్రజల కోసమే పోరాటం అని చెబుతూ వచ్చిన కామ్రేడ్లు.. తమ సొంత లక్ష్యాల కోసం, పార్టీని కాపాడుకునేందుకే ఎక్కువ మొగ్గు చూపుతున్నారని బిహారీలు భావిస్తున్నారు. ఈ పరిస్థితులకు వామపక్షాలు వారిని వారే నిందించుకోవాల్సి వస్తోంది. దేశంలో ఉన్న కీలక సమస్యలపై పోరాడాల్సిన సమయంలో వామపక్షాలు మౌనంగా ఉండిపోవటం.. వారికి చేటు చేసింది.
స్వాతంత్ర్యం తర్వాత.. బిహార్‌లోనే కాకుండా దేశవ్యాప్తంగా వామపక్షాలు బలమైన పునాదులు ఏర్పరుచుకున్నాయి. ఒక దశలో ప్రభుత్వాలను శాసించే స్థితిలో ఉండేవి. క్షేత్రస్థాయిలో నమ్మకమైన కామ్రేడ్లు ఉండేవారు. ఒక్కసారి వామపక్షాల్లోకి కూడా అవకాశవాద రాజకీయాలు ప్రవేశించిన తర్వాత పరిస్థితులు మారిపోయాయి.
అవకాశవాదమే అనర్థం!
ఇక జాతీయ స్థాయిలో కామ్రేడ్ల పనితీరు పరిశీలిస్తే.. 2004లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు పూర్తిస్థాయి మెజార్టీ సాధించలేకపోయింది. ప్రభుత్వ ఏర్పాటులో 59 సీట్లు గెలుచుకున్న వామపక్షాలు కీలకపాత్ర పోషించాయి. అనంతరం పార్టీ పనితీరు క్షీణిస్తూ వస్తోంది. 2009 ఎన్నికల్లో 24 స్థానాలకే పరిమితమయ్యారు. నాటి ఎన్నికల్లో కాంగ్రెస్‌తో కలిసి బరిలోకి దిగటం.. క్షేత్రస్థాయిలో మద్దతుదారులకు పార్టీని దూరం చేసింది. ప్రజాపోరాటం అన్న నినాదాలకు విలువ లేకుండా పోయింది. ఇక 2014లో మోదీ మేనియాతో ఎర్రజెండాలు కేవలం 12 స్థానాల్లోనే రెపరెపలాడాయి.
బిహార్‌లో ఘనచరిత్ర
ఇక బిహార్ విషయానికి వస్తే.. ప్రభుత్వ ఏర్పాట్లలో కీలక పాత్ర పోషిస్తూ ప్రభుత్వ నిర్ణయాలను ప్రభావితం చేసే స్థాయిలో ఉండేది వామపక్షాల హవా. రాష్ట్రం నుంచి అత్యధికంగా 24మంది ఎమ్మెల్యేలు, ఐదుగురు ఎంపీలు ప్రాతినిధ్యం వహించిన సందర్భాలున్నాయి. 1972లో రాష్ట్రంలో సుశీల్ ముఖర్జీ నేతృత్వంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉండేది సీపీఐ. 1991లో ఆ పార్టీ నుంచి 8మంది ఎంపీలు ఉండేవారు. అలాగే, సీపీఎం, సీపీఐ-ఎంఎల్ నుంచి కూడా ప్రాతినిధ్యం ఉండేది. భూసంస్కరణలు, హక్కుల పోరాటాలు, అగ్రవర్ణాల దోపిడి-దారుణాలకు వ్యతిరకంగా గళమెత్తడం వంటి అంశాలు వారికి ప్రజల మద్దతు కూడగట్టాయి.
మొదలైన వ్యతిరేకత..
ప్రజల మద్దతు సంపాదించుకున్నా.. ప్రభుత్వ విధానాలకు వంతపాడటం వల్ల వ్యతిరేకత ఆరంభమైంది. ప్రజల హక్కుల కోసం పోరాడతామన్న కామ్రేడ్లు.. పార్టీ అంతర్గత సమస్యలతో జనాలకు దూరమవుతూవచ్చారు. 1969లో బిహార్ మధ్యంతర ఎన్నికల్లో ఏ పార్టీ మెజార్టీ దక్కించుకోలేకపోయింది. ఈ దశలో కింగ్‌మేకర్‌గా అవతరించిన సీపీఐ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేయటంలో సాయపడింది. ఇన్నాళ్లూ వారి విధానాలపైనే పోరాడి.. చివరకు వారికే మద్దతు ఇవ్వటం ప్రజలకు రుచించలేదు. ఈ నిర్ణయం దేశంలో కొత్త కమ్యూనిస్ట్ రాజకీయాలకు తెరదీసింది.
జేపీ ప్రభావం
అయితే, రాష్ట్రంలో సీపీఐ 1972లో ప్రధాన ప్రతిపక్షంగా ఉంది. కొన్ని ప్రాంతాల్లో బలమైన మద్దతు కూడగట్టుకుంది. 1975లో జయప్రకాశ్ నారాయణ ఉద్యమం బిహార్ రాజకీయాలను మలుపు తిప్పింది. ఇందిరా గాంధీకి మద్దతు తెలిపిన వామపక్షాలు.. జేపీ ఉద్యమంతో భారీగా ప్రజల మద్దతు కోల్పోయారు.