రంజుగా సాగుతున్న బిహార్ రాజకీయాల్లో ప్రస్తుతం అన్ని పార్టీల దృష్టి.. రాఘోపుర్ నియోజకవర్గంపై పడింది. ఆర్జేడీకి ప్రతిష్టాత్మకమైన ఈ స్థానంలో... లాలూ తనయుడిని కంగు తినిపించాలని భాజపా ఊవిళ్లూరుతోంది. అదే సమయంలో ఎల్జేపీ.. తమ అభ్యర్థిని బరిలో నిలిపి, ఓట్లు చీల్చుతుందని కమలదళం కలవరపడుతోంది.
రసవత్తర పోరు..
ఇలా రసవత్తర పోరు సాగుతున్న రాఘోపుర్ గడ్డపై.. ప్రధాన పోటీదారులుగా ఉన్న ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్, ఆ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే, భాజపా నేత సతీశ్ కుమార్ నామినేషన్లు దాఖలు చేశారు. హాజీపుర్ లోక్సభ స్థానం పరిధిలో ఉండే రాఘోపుర్లో దాదాపు 3లక్షల మంది ఓటర్లు ఉన్నారు. రాష్ట్రీయ జనతాదళ్ కంచుకొటల్లో ఇదీ ఒకటి. గత రెండు దశాబ్దాల్లో ఈ స్థానంలో ఆర్జేడీ గట్టి పట్టు సాధించింది. 2015 ఎన్నికల్లో గెలుపొందిన తేజస్వీ యాదవ్ ప్రస్తుతం ఇక్కడ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు.
ఆయనకు పోటీగా భాజపా ఈ స్థానం నుంచి సతీశ్ కుమార్ను రంగంలోకి దింపింది. ఆయన 2010లో మాజీ ముఖ్యమంత్రి, లాలూ సతీమణి రబ్రీదేవిని ఓడించారు.
ఇదీ చూడండి: బిహార్ బరి: కంచు కోటలపై పట్టు నిలిచేనా?
యాదవులదే హవా..
గంగానది పరీవాహక ప్రాంత్రంలో, రాజధాని పట్నాకు దగ్గరలోనే ఉన్న రాఘోపుర్లో.. యాదవ ఓటర్లే అత్యధికంగా ఉంటారు. ఈ నియోజకవర్గానికి లాలూప్రసాద్ యాదవ్ రెండుసార్లు ప్రాతినిధ్యం వహించగా.. 2005-10మధ్య రబ్రీదేవి ఎమ్మెల్యేగా ఉన్నారు. అయితే, 2010లో జేడీయూ భాగస్వామ్యంతో ఈ సీటు గెలుచుకుంది. ప్రస్తుతం ఆర్జేడీ నుంచి ఉదయ్ నారాయణ్ వంటి కీలక నేతలు జేడీయూలోకి వెళ్లిపోవటం మరోసారి ఎన్డీఏలో ఆశలు రేకెత్తిస్తోంది.