కరోనా తర్వాత దేశవ్యాప్తంగా జరుగుతున్న మహాసంగ్రామం బిహార్ ఎన్నికలు. ఈ సమరంలో యువతను ఆకట్టుకునే ప్రయత్నాల్లో ఉన్నాయి అన్ని పార్టీలు. లాక్డౌన్ కాలంలో ఉపాధి కోల్పోయిన లక్షల మంది వలస కూలీలు, యువతను ఆకర్షించేందుకు ఉద్యోగాల కల్పనే ప్రధానాంశమని తమ మేనిఫెస్టోల ద్వారా ప్రకటిస్తున్నాయి. పింఛను పథకాలు, వ్యవసాయ బిల్లుల రద్దు, ఉచిత కరోనా వ్యాక్సిన్ కంటే ఉద్యోగమే కీలక హామీగా ప్రచారాల్లో దూసుకెళ్తున్నాయి.
అధికార కూటమిలో ఉన్న భాజపా రానున్న 5 ఏళ్లలో.. 19 లక్షల ఉద్యోగాలు ఇస్తామని ప్రకటించింది. అయితే విపక్షాలు మాత్రం ఇన్ని లక్షల ఉద్యోగాలు సాధ్యం కావని ఖండిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆయా పార్టీలు ఇచ్చిన వరాల జల్లులు ఏంటో ఓసారి చూద్దాం..
భాజపా మేనిఫెస్టోలోని కీలకాంశాలు..
నితీశ్ నేతృత్వంలోని జేడీయూ, భాజపా కలిసి ఎన్డీఏగా బరిలోకి దిగుతున్నాయి. నితీశ్ మరోసారి ముఖ్యమంత్రి అభ్యర్థిగా పోటీచేస్తున్నారు. భాజపా ఇచ్చిన హామీల్లో ప్రధానమైనవి...
- బిహార్ వాసులకు ఉచితంగా కొవిడ్-19 టీకా
- 19 లక్షల ఉద్యోగాల కల్పన (10 లక్షల వ్యవసాయ సంబంధిత ఉద్యోగాలు, 5 లక్షల ఐటీ, 3 లక్షల ఉపాధ్యాయ, 1 లక్ష ఆరోగ్య రంగంలో ఉద్యోగాలు)
- 3 కోట్ల మంది మహిళలకు స్వయం ఉపాధితో చేయూత
- 9వ తరగతి నుంచి ప్రతి విద్యార్థికి ఉచిత ట్యాబ్లెట్
- 2 ఏళ్లలో 15 కొత్త వ్యవసాయ ప్రాసెసింగ్ పరిశ్రమలు ఏర్పాటు
- బిహార్‌లో ఐటీ హబ్, పట్నా, రాజ్‌గిర్‌లో ఐటీ ఇన్ఫ్రా అభివృద్ధి
- లక్ష మంది మహిళలకు మైక్రో ఫైనాన్సింగ్ సదుపాయం
- రాష్ట్రంలో క్రీడా వర్సిటీ నిర్మాణం
- డిజిటల్ కౌన్సిలింగ్ కేంద్రాల ఏర్పాటు
- 2024 నుంచి దర్బంగా ఎయిమ్స్ కార్యకలాపాలు ప్రారంభం
- గ్రామాలు, పట్టణాల్లో 30 లక్షల మందికి గృహకల్పన
- వలస కార్మికుడు వేరే రాష్ట్రంలో చనిపోతే బాధిత కుటుంబానికి రూ.2 లక్షల పరిహారం
- దేశ సేవలో చనిపోయిన జవాను కుటుంబంలో ఒకరికి ఉద్యోగం, రూ.25 లక్షల ఆర్థిక సాయం
- చిరుదాన్యాలకు మద్దతు ధర అమలు
- ప్రతి గ్రామం, పట్టణాల్లో.. 4జీ, బ్రాడ్‌బాండ్ సేవలు
మహాకూటమి మేనిఫెస్టో కీలకాంశాలు..
ఆర్జేడీ, కాంగ్రెస్, సీపీఐ ,సీపీఎం కలిసి బిహార్ ఎన్నికల్లో 'మహాకూటమి'గా బరిలోకి దిగనున్నాయి. తేజస్వీ యాదవ్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా కూటమి ముందుకు సాగుతోంది. మహాకూటమి హామీలు ఇలా ఉన్నాయి...
- 10 లక్షల ఉద్యోగాల కల్పన
- నిరుద్యోగులకు నెలకు రూ.1500 భృతి
- ప్రతి జిల్లాలో మెడికల్ కాలేజీతో పాటు ఆస్పత్రుల నిర్మాణం
- ప్రతి గ్రామంలో సీసీటీవీ కెమెరాల ఏర్పాటు
- నూతన పరిశ్రమల విధానం అమలు
- ప్రభుత్వ ఉద్యోగాలకు, ప్రభుత్వ పరీక్షలకు హాజరయ్యే స్థానికులకు ఫీజుల మినహాయింపు
- పేదలకు, వృద్ధులకు రూ.1000 పింఛను
- కాంట్రాక్ట్ ఉద్యోగులను తిరిగి విధుల్లోకి చేర్చుకోవడం
- ప్రైవేటీకరణకు స్వస్తి
- అన్ని నీటిపారుదల పంపులను సౌర పంపులుగా మార్చడం
- బిహార్‌లో క్రీడా విశ్వవిద్యాలయం
- ప్రతి డివిజన్‌లోనూ పెద్ద స్టేడియం
- ప్రభుత్వ ఉద్యోగులకు ముందస్తు పింఛను వ్యవస్థ
- ప్రత్యేక ఆర్థిక జోన్ల ఏర్పాటు
- విద్యుత్ రేట్లలో కోత
- రైతు రుణాల మాఫీ
- ప్రజలకు సహాయం చేసేందుకు రాష్ట్రవ్యాప్తంగా 'కరుపురి శ్రమ్ వీర్ సహాయత' కేంద్రాల ఏర్పాటు.
- 'స్మార్ట్ గ్రామ్ యోజన' కింద ప్రతి పంచాయతీలో.. వైద్యుడు, నర్సుతో కూడిన క్లినిక్ ఏర్పాటు.
- కేంద్రం తెచ్చిన వ్యవసాయ చట్టాలను రద్దు చేసేందుకు తొలి శాసనసభ సమావేశంలోనే బిల్లు.