తెలంగాణ

telangana

బిహార్‌ ఎన్నికల చదరంగం: కొత్త శక్తులు- పాత ఎత్తులు!

By

Published : Jul 15, 2020, 7:48 AM IST

ఈ ఏడాది చివర్లో బిహార్​ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆ రాష్ట్రంలో ఇప్పటికే రాజకీయ వేడి రాజుకుంది. ఈ సారి శాసనసభ ఎన్నికల్లో నితీశ్‌కు గట్టి పోటీ ఏదన్నది ఎంత క్లిష్టతరమైన ప్రశ్నో, ఏ పక్షం ఎన్ని ముక్కలుగా చీలి ఎవరు ఎవరితో జట్టు కడతారన్నదీ అంతే అనూహ్యం. ఎప్పటికెయ్యదిగా చిలవలు పలవలు వేసుకుపోతున్న విడ్డూర రాజకీయం బిహార్‌ యవనికపై ఏమేమి కొత్త పొత్తుల్ని ఆవిష్కరించనుందో ఏమో ఈ క్షణాన అగమ్యం.

BIHAR ELECTION STORY
బిహార్‌ ఎన్నికల చదరంగం

ఈ ఏడాది శాసనసభ ఎన్నికలు జరగనున్న ఏకైక రాష్ట్రం బిహార్‌. మొత్తం 243 అసెంబ్లీ నియోజకవర్గాలు కలిగిన అక్కడ అక్టోబర్‌, నవంబర్లలో ఎలెక్షన్లు నిర్వహించాల్సి ఉంది. అధికారికంగా ఎన్నికల ప్రకటన వెలువడటానికి ముందే బిహార్‌లో రాజకీయ వాతావరణం వేడెక్కింది. బిహార్‌ ఎన్నికలకు సంబంధించినంతవరకు లోక్‌ జనశక్తి పార్టీ(ఎల్‌జేపీ) ఎన్డీయేలో అంతర్భాగమేనన్న భాజపా- తమ ముఖ్యమంత్రి అభ్యర్థి నితీశ్‌ కుమారేనని కరాఖండీగా ప్రకటించింది. కమలనాథులు ఇచ్చిన ఈ 'స్పష్టత' ఏయే మార్పులకు ప్రేరకమవుతుందో చూడాలి.

బిహార్​ ప్రధాన పార్టీల నేతలు

రాజకీయ చిటపటలు

కొన్నాళ్లుగా బిహార్‌లో రాజకీయ చిటపటలు వార్తలకు ఎక్కుతూనే ఉన్నాయి. రేపటి అసెంబ్లీ ఎలెక్షన్లకు సంబంధించి సీట్ల పంపిణీపై ప్రస్తుత అధికార కూటమిలో భిన్నాభిప్రాయాలు సహజంగానే ఇంటా బయటా ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. అయిదేళ్ల క్రితం శాసనసభ ఎన్నికల్లో 42 స్థానాల్లో పోటీ చేసిన ఎల్‌జేపీ కేవలం రెండే చోట్ల గెలవగలిగింది. 2005నాటి 12.62శాతం ఓట్ల వాటా సైతం 2015లో సుమారు అయిదు శాతానికి పడిపోయింది. అయినప్పటికీ, ఈసారీ గత ఎన్నికల్లో మాదిరిగానే తమకు సీట్లు కేటాయించాలని ఎల్‌జేపీ అధ్యక్ష హోదాలో చిరాగ్‌ పాసవాన్‌ (కేంద్రమంత్రి రామ్‌ విలాస్‌ పాసవాన్‌ తనయుడు) పట్టుపడుతుండటం జేడీ(యు) నాయకత్వానికి తలనొప్పిగా మారింది. గరిష్ఠంగా పది స్థానాలు ఇచ్చి సర్దుకొమ్మందామన్న ఆ పార్టీ యోచన కర్ణాకర్ణిగా చెవినపడి 'మా శక్తిని తక్కువగా అంచనా వేస్తున్నా'రని చిరాగ్‌ అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు. ఈ మధ్య ఎల్‌జేపీతో కాంగ్రెస్‌ మంతనాలు జరిపిందన్న కథనం ఉన్నట్టుండి రాజకీయ కాక రగిలించింది. మరోవైపు, ముఖ్యమంత్రి అభ్యర్థిగా చిరాగ్‌ పాసవాన్‌ పేరు ప్రకటించాలంటూ మాజీ ఎంపీ పప్పూ యాదవ్‌ చేసిన వ్యాఖ్యలు తెరవెనక ఏదో కథ నడుస్తున్నదన్న అభిప్రాయం ఏర్పరచడంలో, ఎల్‌జేపీ-జేడీ(యు)ల మధ్య దూరం పెంచడంలో తమవంతు పాత్ర పోషించాయి. నితీశ్‌ ముఖ్యమంత్రి అభ్యర్థిత్వంపై అటు భాజపా, ఇటు ఐక్య జనతాదళ్‌ వెనకడుగు వేసే అవకాశం లేనే లేదు. అది తెలిసీ, ఎల్‌జేపీ వ్యవహరిస్తున్న తీరు- తెగేదాకా లాగే ధోరణినే కళ్లకు కడుతోంది.

పరిశుద్ధ రాజకీయవాదిగా జనాదరణ నితీశ్‌ సహజ బలిమి. అదంతా గడిచిపోయిన గతమంటూ... నిరుద్యోగం, నేరాలు, అవినీతి పెచ్చరిల్లిన నేపథ్యంలో బిహార్‌ ఓటర్లు ప్రత్యామ్నాయాన్ని కోరుకుంటున్నారని రాష్ట్రీయ జనతాదళ్‌(ఆర్‌జేడీ) యువ సారథి తేజస్వీ యాదవ్‌ ధూమ్‌ ధామ్‌ ప్రచారానికి తెరతీశారు. అన్నీ అనుకూలిస్తే రేపటి ఎన్నికల్లో ఏకపక్షంగా దున్నేస్తామని, 'క్లీన్‌ స్వీప్‌'తో సరికొత్త రికార్డు నెలకొల్పుతామని ఆయన ఊదరగొడుతున్నా- వాస్తవం వేరు. ఆర్‌జేడీ తరఫున ప్రచార బాధ్యతల్ని ఏళ్ల తరబడి భుజాన మోసిన లాలు ప్రసాద్‌ యాదవ్‌ జైలుపాలు కావడం- ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో ఆ పార్టీ పుట్టి ముంచింది. రేపటి అసెంబ్లీ హోరాహోరీ పోరు సందర్భంగానూ లాలు బరిలోకి దిగే అవకాశం లేదంటే, ముందుగానే ఆర్‌జేడీ రెక్కలు విరిగినట్లే. విపక్ష శిబిరంలో ఏదీ సవ్యంగా లేదని, రాష్ట్రీయ జనతాదళ్‌పై ప్రబలుతున్న అసంతృప్తి చాటుతోంది. తేజస్వీ యాదవ్‌ నాయకత్వ సామర్థ్యంపై, అతడి ముఖ్యమంత్రి అభ్యర్థిత్వంపై తీవ్రస్థాయి అభ్యంతరాలు ప్రతిపక్ష శిబిరంలో లుకలుకలకు ప్రబల సంకేతాలు. వేర్వేరు పక్షాల్ని ఏకతాటిపై నడిపించగల దక్షత, ఎన్డీయే వ్యూహాలకు దీటుగా ప్రతివ్యూహాలు రచించి అమలుపరచే నేర్పు ప్రస్తుత ఆర్‌జేడీలో ఎక్కడున్నాయని రాష్ట్రీయ లోక్‌ సమతా పార్టీ సారథి ఉపేంద్ర కుష్వాహా, వికాస్‌ శీల్‌ ఇన్‌సాన్‌ పార్టీ నేత ముఖేశ్‌ సహానీ వంటివారు పెదవి విరుస్తున్నారు. ఆర్‌జేడీ నాయకత్వం పట్ల అసంతృప్తితో మాజీ ముఖ్యమంత్రి జితన్‌ రామ్‌ మాంఝీ జేడీ(యు)కి చేరువవుతున్నారనీ అంటున్నారు. ఒక్క ముక్కలో, విపక్ష శిబిరం చీలిపోవడం అనివార్యంగా కనిపిస్తోంది.

సరైన ప్రత్యామ్నాయం లేదు...

మునుపటితో పోలిస్తే- ముఖ్యమంత్రిగా నితీశ్‌ వ్యక్తిగత ఆకర్షణ శక్తి, దేనికీ ఎందులోనూ రాజీపడరన్న విలక్షణ ఇమేజ్‌ దెబ్బతిన్న మాట యథార్థం. లాలు-రబ్రీల పదేళ్ల పాలనను పడతిట్టిపోసి 2005లో రాష్ట్రాధికారం చేపట్టిన నితీశ్‌, 2010లోనూ భాజపా దన్నుతో గద్దెనెక్కారు. కమలం పార్టీ దూరమయ్యాక ఆర్‌జేడీ, కాంగ్రెస్‌ల దన్నుతో బండి నడిపించారు. అయిదేళ్ల క్రితం మోదీ ప్రభంజనాన్ని నిలువరించే ఏకైక లక్ష్యంతో మహా గట్‌బంధన్‌(మహాకూటమి) ముఖ్యమంత్రిగా పోటీచేసి గెలిచాక, రెండేళ్ల దరిమిలా- రాత్రికి రాత్రి ఆయన ఎన్డీయే సీఎమ్‌గా రూపాంతరం చెందడం ఊహించని మలుపు. ఈసారి శాసనసభ ఎన్నికల్లో నితీశ్‌కు గట్టి పోటీ ఏదన్నది ఎంత క్లిష్టతరమైన ప్రశ్నో, ఏ పక్షం ఎన్ని ముక్కలుగా చీలి ఎవరు ఎవరితో జట్టు కడతారన్నదీ అంతే అనూహ్యం. ఎప్పటికెయ్యదిగా చిలవలు పలవలు వేసుకుపోతున్న విడ్డూర రాజకీయం బిహార్‌ యవనికపై ఏమేమి కొత్త పొత్తుల్ని ఆవిష్కరించనుందో ఏమో ఈ క్షణాన అగమ్యం. అక్కడ రేపు ఏమైనా జరగవచ్చు!

- హరిచందన

ABOUT THE AUTHOR

...view details