బిహార్ ఎన్నికల్లో పార్టీలన్నీ హోరాహోరీగా తలపడుతున్నాయి. గెలుపే లక్ష్యంగా కూటములు కట్టిన పక్షాలన్నీ... పరస్పర ఆరోపణలతో విరుచుకుపడుతున్నాయి. అధికార జేడీయూ... ఆర్జేడీపై వారసత్వ రాజకీయాలంటూ విమర్శల బాణాలు సంధిస్తోంది. ప్రతిపక్ష ఆర్జేడీ సైతం.. బిహార్ ప్రజలను నితీశ్ కుమార్ అభివృద్ధి పేరుతో మోసం చేశారంటూ మాటల తూటాలు వదులుతోంది. మొత్తంగా బిహార్ రాజకీయం వేడెక్కింది.
కుటుంబ స్థానాలు..
ఈ పరిస్థితుల్లోనే మహాకూటమిలో సీట్ల సర్దుబాటు కొలిక్కి వచ్చింది. 144 స్థానాల్లో పోటీ చేయనున్న ఆర్జేడీ.. అభ్యర్థుల తొలి జాబితా విడుదల చేసింది. ఆర్జేడీ ఆధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబం పోటీ చేయనున్న స్థానాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఆ కుటుంబానికి కంచుకోటలా ఉన్న ఛాప్రా, రఘోపుర్, మహువా స్థానాల్లో మరోసారి ఆర్జేడీ లాంతరు వెలుగులు జిమ్ముతుందా ? ఆ స్థానాల్లో క్షేత్రస్థాయి పరిస్థితులు పరిశీలిస్తే...
లాలూ ప్రసాద్ యాదవ్.. ఏళ్లుగా ఛాప్రా నియోజకవర్గం నుంచే బరిలోకి దిగుతున్నారు. ఆయన సతీమణి, మాజీ ముఖ్యమంత్రి రబ్రీదేవి రఘోపుర్ నుంచి పోటీలో నిలుస్తున్నారు. ఇప్పుడు వారసత్వంగా తేజస్వీ యదవ్ అందుకున్నారు.
ప్రధానంగా ఛాప్రా, రఘోపుర్ స్థానాలు.. ఈ ఎన్నికల్లోనూ కీలకంగా నిలవనున్నాయి. గత ఎన్నికల్లో లాలూ మొదటి కుమారుడు తేజ్ ప్రతాప్.. మహువా స్థానం నుంచి పోటీ చేశారు.
ఛాప్రా.. లాలూ ఇలాఖా..
లాలూ కుటుంబానికి సంబంధించినంత వరకు అత్యంత కీలకమైన అసెంబ్లీ స్థానం ఛాప్రా. బిహార్ రాజకీయ వర్గాలు ఇది లాలూకు పెట్టని కోటగా భావిస్తాయి. అయితే, 2010లో భాజపా అభ్యర్థి జనార్ధన్ సిగ్రివాల్ ఈ స్థానం నుంచి విజయం సాధించి సంచలనం సృష్టించారు.
2014లో జనార్ధన్ లోక్సభకు ఎన్నికైన అనంతరం.. ఉప ఎన్నికలో ఈ స్థానం తిరిగి దక్కించుకుంది ఆర్జేడీ.
2015లో వికసించిన కమలం
ఛాప్రాలో 2015 అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా అభ్యర్థి... ఆర్జేడీ నేతపై 11,000 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఆర్జేడీ-జేడీయూ కలిసి పోటీ చేసిన ఎన్నికలివి. 57.87% ఓటింగ్ నమోదైన ఈ స్థానంలో భాజపా 45శాతం ఓట్లు దక్కించుకోగా.. ఆర్జేడీ 38కే పరిమితమైంది.
మొత్తంగా ఈ మధ్య జరిగిన ఎన్నికల్లో ఆ స్థానం నుంచి ఆర్జేడీ 2014 ఉపఎన్నికల్లో మాత్రమే విజయం సాధించగలిగింది. జేడీయూ-భాజపా చెరో రెండుసార్లు ప్రాతినిధ్యం వహించాయి. ఈ నేపథ్యంలోనే ఎన్డీఏ అభ్యర్థి ఎంపిక కీలకంగా మారింది.
రఘోపుర్లో హవా..
రఘోపుర్ అసెంబ్లీ స్థానానికి బిహార్ ఎన్నికల్లో ప్రత్యేక గుర్తింపు ఉంది. వైశాలి జిల్లాలో ఉన్న ఈ నియోజకవర్గం నుంచి.. 1995లో లాలూ ప్రసాద్ యాదవ్ పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో మొదటిసారిగా జనతాదళ్ నుంచి పోటీలోకి దిగి విజయం సాధించారు లాలూ.