బిహార్ రాజకీయాలు రసకందాయంలో పడ్డాయి. పార్టీల పొత్తులు, సీట్ల సర్దుబాటు కొలిక్కి వచ్చినా.. అధికారపక్షాన్ని ఒక పార్టీ వైఖరి కలవరపెడుతోంది. ఎన్డీఏలో ప్రధాన పక్షాలుగా ఉన్న జేడీయూ-భాజపా తమ బలంగా ధృడంగా ఉందని భరోసాగా చెబుతున్నా.. ఎక్కడో ఏదో తేడాగా ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా కూటమిలో అంతా సవ్యంగా లేదని... జేడీయూ నేతలు బలంగా విశ్వసిస్తున్నారు. ఇందుకు ప్రధాన కారణం.. ఇన్నాళ్లూ మిత్రపక్షంగా ఉండి ఇప్పుడు ఎదురుతిరిగిన ఎల్జేపీ వైఖరే.
ప్రస్తుతం మేము (జేడీయూ, భాజపా) కలిసే పనిచేస్తున్నాం. భవిష్యత్తులోనూ కలిసే పనిచేస్తాం. ఎవరెన్ని స్థానాలు గెలిచినా నితీశ్ కుమారే ఎన్డీఏ నాయకుడని నేను మరోమారు స్పష్టం చేస్తున్నా.
-సంజయ్ జైస్వాల్, బిహార్ భాజపా అధ్యక్షుడు
ఎల్‌జేపీ ఒంటరిగా పోటీ చేసేందుకు వెళ్లి తప్పుడు నిర్ణయం తీసుకుంది. రామ్ విలాస్ పాసవాన్ శస్త్రచికిత్సకు వెళ్లకుండా ఉండి ఉంటే ఆయన కుమారుడు చిరాగ్ ఆ నిర్ణయం తీసుకునేవారు కాదు.
-సుశీల్ మోదీ, భాజపా నేత, బిహార్ ఉపముఖ్యమంత్రి
ఇవీ.. ప్రస్తుతం బిహార్ భాజపా నాయకులు చెబుతున్న మాటలు. అయితే, జేడీయూ నేతల అనుమానాలు, ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు వేరుగా కనిపిస్తున్నాయి.
భాజపా నుంచి ఎల్జేపీకి వలసలు
మంగళవారం.. బిహార్ భాజపా ఉపాధ్యక్షుడు రాజేంద్ర సింగ్.. ఎల్జేపీ తీర్థం పుచ్చుకున్నారు. అధ్యక్షుడు చిరాగ్ పాసవాన్ సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు. కారణం.. పొత్తుల్లో భాగంగా దినారా స్థానం జేడీయూకు వెళ్లిపోవటమే.
మరో భాజపా నేత ఉషా విద్యార్థి.. ఎల్జేపీలో చేరిపోయారు. పాసవాన్ పార్టీ నుంచి పాలిగంజ్ స్థానంలో పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. రాజేంద్ర సింగ్ చేప్పిన కారణమే ఉషా చెప్పారు.
భారతీయ జనతా పార్టీకి చెందిన మరో నేత సైతం.. ఎల్జేపీ గూటికి చేరారు. భాజపా నేత రామేశ్వర్ చౌరాసియా.. బుధవారం చిరాగ్ పార్టీలో చేరిపోయారు.
రామేశ్వర్ చౌరాసియా(నీలి చొక్కా ధరించిన వ్యక్తి) జేడీయూ అనుమానాలు
ఈ నేపథ్యంలో జేడీయూ అనుమానాలు బలపడుతున్నాయి. ఇప్పటికే ఎల్జేపీ... జేడీయూ ఓటమే తమ లక్ష్యమని ప్రకటించింది. వారు పోటీ చేసే అన్ని స్థానాల్లో పోటీకి దిగుతామని స్పష్టం చేసింది. అదే సమయంలో భాజపాతో బలమైన బంధం కొనసాగిస్తామనడం చర్చనీయాంశమైంది.
భాజపా ఎక్కడా పాసవాన్ పార్టీని పల్లెత్తు మాట అనటం లేదు. ఎల్జేపీ మాజీ మిత్రపక్షం జేడీయూపై విరుచుకుపడుతోంది.
భాజపాతో బలమైన బంధం
భాజపాతో తమకు సహృద్భావ సంబంధాలున్నాయని.. బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్‌డీఏ నుంచి బయటకొచ్చిన లోక్ జన్‌శక్తి పార్టీ అధ్యక్షుడు చిరాగ్ పాసవాన్ పునరుద్ఘాటిస్తున్నారు.
2014లో నేను తొలిసారి తలపడిన ఎన్నికల నుంచి ప్రధాని మోదీకి మద్దతు కొనసాగిస్తూ వస్తున్నాను. నితీశ్ మాత్రం గతంలో లాలూప్రసాద్‌తో చేతులు కలిపారు. తిరిగి 2017లో ఎన్‌డీఏలో చేరారు. బిహార్‌ను ఎలా అభివృద్ధి చేయాలి? అనే విషయం కంటే తాను ముఖ్యమంత్రిగానే ఉండటానికి ఏం చేయాలి? అనేదే నిరంతరం నితీశ్ ఆలోచన.
-చిరాగ్ పాసవాన్, ఎల్జేపీ అధ్యక్షుడు
నితీశ్ ప్రభుత్వంతో తనకు విభేదాలున్నట్లు భాజపాకు చాలా ముందుగానే తెలియజేసినట్లు వివరించారు చిరాగ్. జేడీయూని లక్ష్యంగా చేసుకునే భాజపాతో లోపాయికారీ ఒప్పందం కుదుర్చుకున్నట్లు వస్తున్న విమర్శలపై స్పందించడానికి మాత్రం ఆయన నిరాకరిస్తున్నారు. దీనికి జవాబు చెప్పాల్సింది భాజపాయేనంటున్నారు. తమ పార్టీ కేంద్రంలో భాజపా నేతృత్వంలోని ఎన్‌డీఏలో కొనసాగుతుందని స్పష్టం చేస్తున్నారు.
కాషాయ వ్యూహం ?
పాసవాన్ నిర్ణయం వెనుక భాజపా పెద్దలు ఉన్నారని, ఈ ఎన్నికల్లో జేడీయూ అభ్యర్థులను ఓడించి అసెంబ్లీ అతిపెద్ద పార్టీగా అవతరించి సీఎం పీఠాన్ని అధిష్టించాలన్నదే కమళనాథుల వ్యూహంగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. భాజపా నాయకత్వానికి తాము ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటామని ప్రకటించడం వెనుక ఏదో తెలియని రహస్యం దాగి ఉందని... కుదిరితే కింగ్ మేకర్‌గా అవతరించే అవకాశం దక్కుతుందని పాసవాన్ల ఆశ అని అభిప్రాయపడుతున్నారు. మరి దీనిలో భాగంగానే ఎల్‌జేపీ అభ్యర్థులను జేడీయూపై పోటీకి నిలపాలని నిర్ణయించారా ?
ఏదైతేనేం.. పాసవాన్ల నిర్ణయంతో బిహార్ రాజకీయాలు కీలక మలుపు తిరిగాయి. రాజకీయం మరింత రసవత్తంగా మారింది.
చివరగా..
భాజపా, జేడీయూ మధ్య సీట్ల పంపకాల విషయంలో ఎలాంటి అయోమయం లేదు. ఎవరు ఎక్కడి నుంచి పోటీ చేయాలనేది ఇప్పటికే నిర్ణయం తీసుకున్నాం. దాని గురించి భాజపాలో గానీ, జేడీయూలో గానీ ఎవరూ గందరగోళానికి గురికావల్సిన అవసరం లేదు.
-నితీశ్ కుమార్, జేడీయూ అధినేత, బిహార్ సీఎం
చివరకు ఈ పొత్తుల రాజకీయాల్లో చిత్తయ్యేదెవరో ? అనే ప్రశ్నకు నవంబర్-10 సమాధానం చెప్పనుంది. బిహరీ పార్టీలు సస్పెన్స్ థ్రిల్లర్ ఎత్తులు మాత్రం.. ఎప్పుడూ నిరాశ పరచవు !
ఇదీ చూడండి: నితీశ్‌కు చెక్ పెట్టేందుకే భాజపా వ్యూహం!
ఇదీ చూడండి: బిహార్ బరి: సీట్ల లెక్కలు పూర్తి- గెలుపుపైనే గురి