బిహార్ అసెంబ్లీ ఎన్నికల సమరం ముగిసింది. ఇప్పటికే రెండు విడతల్లో పోలింగ్ పూర్తికాగా.. శనివారం మూడో దశ పోలింగ్ ప్రశాంతంగా సమాప్తమైంది. తుది విడత ఎన్నికల్లో సాయంత్రం 5గంటల వరకు 55.22% పోలింగ్ నమోదైనట్టు అధికారులు వెల్లడించారు. సాయంత్రం 6గంటల సమయానికి క్యూలైన్లలో వేచి ఉన్న వారికి ఓటు వేసేందుకు అవకాశం కల్పించారు. దీంతో పోలింగ్ శాతం మరింతగా పెరిగే అవకాశం ఉంది.
బిహార్‌లో మొత్తం 243 అసెంబ్లీ స్థానాలకు మూడు దశల్లో ఎన్నికలు జరిగాయి. అక్టోబర్ 28న 71 స్థానాలకు జరిగిన తొలి విడత ఎన్నికల్లో 54.70శాతం పోలింగ్ నమోదు కాగా.. నవంబర్ 3న 94 స్థానాలకు జరిగిన రెండో విడతలో 55.70% పోలింగ్ నమోదైంది. ఆఖరి దశలో 2 కోట్ల మందికి పైగా ఓటర్లు 1,200 మందికి పైగా అభ్యర్థుల భవితవ్యాన్ని ఈవీఎంలలో నిక్షిప్తం చేశారు. ఇప్పటివరకు జరిగిన పోలింగ్‌లో పురారియా నియోజకవర్గంలో అత్యధికంగా 55.50శాతం నమోదైంది. ఈ నెల 10న బిహార్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు వెల్లడికానున్నాయి.