బిహార్‌లో కాంగ్రెస్ పరిస్థితి అత్యంత దయనీయంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. తమ పార్టీకి చెందిన 11 మంది ఎమ్మెల్యేలు త్వరలోనే ఎన్డీఏ గూటికి చేరుకుంటారని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే భరత్ సింగ్ చెప్పారు. కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు మదన్ మోహన్ ఝా, రాజ్యసభ ఎంపీ అఖిలేశ్ ప్రసాద్ సింగ్, సీనియర్ నేత సదానంద్ సింగ్ కూడా పార్టీని వీడనున్నారని వెల్లడించారు. ఎన్నికల్లో ఆర్జేడీతో పొత్తు వద్దని తాను ముందు నుంచే చెబుతున్నా పట్టించుకోలేదని, బిహార్‌లో కాంగ్రెస్ పరిస్థితిపై అధిష్ఠానానికి ఎప్పుడూ తప్పుడు సమాచారమే వెళ్లిందని భగత్ సింగ్ అన్నారు.
కాంగ్రెస్‌ను వీడనున్న 11మంది ఎమ్మెల్యేలు ఎన్నికలకు ముందు ఇతర పార్టీల నుంచి వచ్చిన వారేనని భగత్ సింగ్ తెలిపారు. వారంతా డబ్బులిచ్చి టికెట్లు పొందారని ఆరోపించారు. మదన్ మోహన్ ఝా, అఖిలేశ్ ప్రసాద్ సింగ్, సదానంద్ సింగ్.. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారని అన్నారు.
కోమాలో ఉంది..
భగత్ సింగ్ వ్యాఖ్యలపై జేడీయూ నేత రాజీవ్ రంజన్ స్పందించారు. బిహార్‌లో కాంగ్రెస్‌ది 'కోమా' పరిస్థితి అని విమర్శించారు. ఆ పార్టీని ముందుకు నడిపించేందుకు నాయకులే లేరని ఎద్దేవా చేశారు. అందుకే కాంగ్రెస్ బిహార్ ఇంఛార్జ్ శక్తి సింగ్ గోహిల్ పదవి నుంచి తప్పించమని కోరుతున్నారని తెలిపారు.