సముద్రమార్గాల ద్వారా వచ్చి భారత్‌లో దాడులకు పాల్పడాలని ఉగ్రవాదులు కుట్రలు పన్నుతున్నారని భారతనావికా దళాధిపతి అడ్మిరల్ సునీల్ లాంబా తెలిపారు. ఇందుకోసం ఉగ్రవాదులు ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్నట్లు సమాచారముందని ప్రకటించారు. దిల్లీలో జరిగిన ఇండో-పసిఫిక్ ప్రాంతీయ సదస్సులో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
భారత్‌కు ముప్పు! - Bharat
ఉగ్రవాదులు సముద్రమార్గాల ద్వారా భారత్‌పై దాడి చేయాలని చూస్తున్నారని భారతనావికా దళాధిపతి అడ్మిరల్ సునీల్ లాంబా తెలిపారు.
" 26/11 దాడులు జరిపిన ఉగ్రవాదులు సముద్ర మార్గం ద్వారా భారత భూభాగంలోకి చొరబడిన విషయం తెలిసిందే. రానున్న రోజుల్లో వేర్వేరు మార్గాల్లో భారత్‌లో దాడులు చేసేందుకు ఉగ్రవాదులు ప్రణాళికలు రచిస్తున్నారు. అందులో భాగంగా సముద్ర మార్గాల ద్వారా కూడా దాడి చేసే విధంగా ఉగ్రవాదులకు శిక్షణనిస్తున్నట్లు సమాచారముంది.
ఈ మధ్య కాలంలో ఇండో-పసిఫిక్ ప్రాంతంలో అనేక రకాల ఉగ్రదాడులను చూశాం. వీటివల్ల అమాయకులైన ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోజురోజుకూ ఉగ్రవాదం కొత్త రూపును సంతరించుకుంటోంది. ఇది ప్రపంచానికి పెను ముప్పుగా వాటిల్లే అవకాశముంది. ప్రపంచ దేశాలు కలిసి ఉగ్రవాదంపై పోరాడాల్సిన సమయం ఆసన్నమైంది. "
- అడ్మిరల్ సునీల్ లాంబా, భారతనావికా దళాధిపతి