దిగ్గజ వ్యాక్సిన్ తయారీ సంస్థ భారత్ బయోటెక్ తమ కరోనా వ్యాక్సిన్... కొవాగ్జిన్ తయారీలో మరో కీలక ముందడుగు వేసింది. దేశవ్యాప్తంగా మూడో విడత క్లినికల్ ట్రయల్స్‌ను సోమవారం నుంచి ప్రారంభించింది. ఈ మేరకు సంస్థ సీఎమ్‌డీ కృష్ణ ఎల్లా ప్రకటించారు.
26వేల మందిపై..
దేశవ్యాప్తంగా 25 సెంటర్లలో 26 వేల మంది వలంటీర్లకు భారత్ బయోటెక్ కొవాగ్జిన్ ఇస్తున్నారు. మొత్తం 28 రోజుల్లో 6 మైక్రో గ్రాముల ఇంజక్షన్ లు రెండు సార్లు లేక ప్లాసిబో రెండు డోస్ లను వాలంటీర్ల కు ఇవ్వనున్నారు. దేశంలో అత్యధిక మందిపై నిర్వహిస్తున్న మొట్టమొదటి ఫేజ్ 3 ట్రయల్స్ ఇవే కావటం విశేషం.
మంచి ఫలితాలు..
కొవాగ్జిన్ మొదటి రెండు దశల ప్రయోగాలు మంచి ఫలితాలు ఇచ్చిన నేపథ్యంలో మూడో దశ ట్రయల్స్ చేపట్టినట్టు కృష్ణ ఎల్లా తెలిపారు. ఇప్పటివరకు ఈ టీకా ట్రయల్స్ సంతృప్తికరంగా సాగగా.. తాజా ట్రయల్స్‌లో పూర్తి స్థాయిలో పరిశీలించనున్నారు. ఐసీఎంఆర్ భాగస్వామ్యంతో ఈ ట్రయల్స్ నిర్వహిస్తున్నారు.
మరో టీకా..
ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బీ) నిర్వహించిన వెబినార్‌లో పాల్గొన్న కృష్ణ ఎల్లా.. కొవిడ్ నివారణ కోసం మరో టీకాను సిద్ధం చేసేందుకు భారత్ బయోటెక్ పనిచేస్తోందని తెలిపారు. ఇది నాసికా చుక్కల రూపంలో ఉంటుందని, వచ్చే ఏడాది నాటికి ఈ టీకా సిద్ధంగా ఉండే అవకాశం ఉందని వెల్లడించారు.