లక్షలాది మంది ప్రాణాలు బలిగొంటున్న కరోనా మహమ్మారికి వ్యాక్సిన్ అభివృద్ధి కోసం దేశవ్యాప్తంగా పరిశోధనలు జరుగుతున్నాయి. అయితే అవన్నీ నెమ్మదిగా జరుగుతుండటం, ఎక్కువ ఖర్చుతో పాటు చివరికి వ్యాక్సిన్ వస్తుందో లేదో అన్న అనుమానాల నడుమ.. ప్రత్యామ్నాయాలపై దృష్టిసారించింది 'ది కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (సీఎస్ఐఆర్)'. కొవిడ్-19 నివారణకు 'మోనోక్లోనల్ యాంటీబాడీ థెరపీ' ఎంతో ఉత్తమం, ఆరోగ్యకరమైనదని తాజాగా ప్రకటించింది. అందుకే ఈ యాంటీబాడీస్‌ను అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. హైదరాబాద్ కేంద్రంగా పనిచేసే భారత్ బయోటెక్‌కు ఈ కీలక బాధ్యతను అప్పగించింది.
పుణెలోని నేషనల్ సెంటర్ ఫర్ సెల్ సైన్స్ (ఎన్‌సీసీఎస్), ఐఐటీ-ఇండోర్, గురుగ్రామ్‌లోని ప్రెడ్ఒమిక్స్ టెక్నాలజీస్ ఈ ప్రాజెక్టులో భాగం కానున్నాయి. న్యూ మిలీనియం ఇండియన్ టెక్నాలజీ లీడర్షిప్ ఇనిషియేటివ్ (ఎన్ఎంఐటీఎల్ఐ) ప్రోగ్రాంలో భాగంగా ఈ ప్రాజెక్టుకు అంగీకారం తెలిపింది ఐసీఎంఆర్.
మోనోక్లోనల్ యాంటీబాడీ థెరపీ.. కరోనాపై ప్రభావవంతంగా పనిచేస్తుందని అనుకుంటున్నట్లు వెల్లడించారు భారత్ బయోటెక్ ఛైర్మన్, ఎండీ డాక్టర్ కృష్ణా ఎల్లా. మరో 6 నెలల్లో యాంటీబాడీస్‌ను అభివృద్ధి చేస్తామని ధీమా వ్యక్తం చేశారు.