కేంద్ర ప్రభుత్వ 'ప్రజావ్యతిరేక' విధానాలకు నిరసనగా 10 కేంద్ర కార్మిక సంఘాలు నేడు దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చాయి. 'భారత్ బంద్' పేరుతో నిర్వహిస్తున్న ఈ సమ్మెలో 25 కోట్ల మంది పాల్గొనే అవకాశం ఉందని అంచనా. ఐఎన్‌టీయూసీ, ఏఐటీయూసీ, సీఐటీయూ, టీయూసీసీ తదితర కార్మిక సంఘాలతో పాటు ఏఐబీఈ, ఏఐబీఓఏ, బీఈఎఫ్ఐ, ఐఎన్‌బీఈఎఫ్ వంటి బ్యాంకు ఉద్యోగ సంఘాలు భారత్ బంద్‌లో పాల్గొనేందుకు సుముఖత వ్యక్తం చేశాయి.
ఈనెల 2వ తేదీన జరిగిన సమావేశంలో కార్మికుల డిమాండ్లపై భరోసా ఇవ్వడంలో కేంద్ర కార్మికశాఖ విఫలమైందని, అందుకే ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా జనవరి 8న అఖిల భారత సమ్మె చేపట్టనున్నట్లు పది కేంద్ర కార్మిక సంఘాలు సంయుక్త ప్రకటనలో తెలిపాయి.
విద్యాసంస్థల్లో పెరిగిన ఫీజులు, విద్య వ్యాపారీకరణకు వ్యతిరేకంగా 60 విద్యార్థి సంఘాలు, విశ్వవిద్యాలయాలకు చెందిన పలు సంఘాలు కూడా ఈ సమ్మెలో పాల్గొనాలని నిర్ణయించాయి. ఈ సమ్మె కారణంగా పలు రకాల సేవలకు నేడు అంతరాయం కలగనుంది. ముఖ్యంగా బ్యాంకింగ్, రవాణా రంగాలపై ఇది తీవ్ర ప్రభావం చూపనుంది. అయితే ప్రైవేటు బ్యాంకులకు మాత్రం సమ్మెతో ఎలాంటి నష్టం ఉండకపోవచ్చు.