తెలంగాణ

telangana

ETV Bharat / bharat

దేశవ్యాప్తంగా హింస, అహింస మధ్య సాగిన 'భారత్​ బంద్'

కార్మిక సంస్కరణలు, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు సహా కేంద్రం పలు ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందని ఆరోపిస్తూ కార్మిక సంఘాలు దేశవ్యాప్తంగా చేపట్టిన భారత్​ బంద్‌.. పలు ప్రాంతాల్లో హింసాత్మకంగా మారింది. బంగాల్​లో వామపక్షాలు, తృణమూల్‌ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. బుర్ద్వాన్‌లో అధికార పార్టీ నేతలు, ఎస్​ఎఫ్​ఐ విద్యార్థి నాయకులు బాహాబాహికి దిగారు. ఒకరిపై ఒకరు పిడిగుద్దులు కురిపించుకున్నారు. దిల్లీ, కేరళ, ముంబయి సహా పలు ప్రాంతాల్లో బంద్​ ప్రశాంతంగా కొనసాగింది.

Bharat band
దేశవ్యాప్తంగా హింస, అహింస మధ్య సాగిన 'భారత్​ బంద్'

By

Published : Jan 8, 2020, 6:08 PM IST

కేంద్ర ప్రభుత్వ 'ప్రజావ్యతిరేక' విధానాలకు నిరసనగా 10 కేంద్ర కార్మిక సంఘాలు దేశవ్యాప్తంగా చేపట్టిన బంద్..​ పలు రాష్ట్రాల్లో ప్రశాంతంగా ముగియగా.. మరికొన్ని చోట్ల హింసకు దారి తీసింది. ఐఎన్‌టీయూసీ, ఏఐటీయూసీ, సీఐటీయూ, టీయూసీసీ తదితర కార్మిక సంఘాలతో పాటు ఏఐబీఈ, ఏఐబీఓఏ, బీఈఎఫ్​ఐ, ఐఎన్​బీఈఎఫ్​ వంటి బ్యాంకు ఉద్యోగ సంఘాలు భారత్ బంద్​లో పాల్గొన్నాయి.

బంగాల్​ భగభగ

బంద్​ కారణంగా బంగాల్​లో పలు హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. మాల్దా జిల్లాలో నిరసనకు దిగిన ఆందోళనకారులు జాతీయ రహదారిని నిర్బంధించారు. అడ్డుకునేందుకు యత్నించిన పోలీసులపై రాళ్లదాడి చేశారు. పోలీసు వాహనాలు, బస్సులకు నిప్పంటించారు. ఫలితంగా పోలీసులు రబ్బరు బుల్లెట్లు, బాష్పవాయువు గోళాలు ప్రయోగించి నిరసనకారులను చెదరగొట్టారు.

బంగాల్‌లోని ఇతర ప్రాంతాల్లోనూ బంద్‌ ఉద్రిక్తంగా మారింది. హావ్​డా, కంచ్రపర, 24 పరగణాల్లో ఆందోళనకారులు రైలు రోకో నిర్వహించినందున రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కోల్‌కతాలో వామపక్షాలు, తృణమూల్‌ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. బుర్ద్వాన్‌లో బంద్‌ సందర్భంగా.. అధికార పార్టీ నేతలు, ఎస్​ఎఫ్​ఐ విద్యార్థి నాయకులు బాహాబాహికి దిగారు. ఒకరిపై ఒకరు పిడిగుద్దులు కురిపించుకున్నారు.

దిల్లీ, కేరళలో బంద్ ప్రశాంతం

బంద్​ కారణంగా దిల్లీలోని పలు మోటారు పరిశ్రమల్లో ఉత్పత్తి నిలిచిపోయింది. మానెసర్‌ పారిశ్రామిక వాడతో పాటు హోండా మోటర్‌ సైకిల్‌ అండ్‌ స్కూటర్‌ ఇండియా కంపెనీలో కార్మికులు విధులకు హాజరు కాలేదు. వామపక్ష పాలిత కేరళలో బంద్ ప్రశాంతంగా కొనసాగింది. బ్యాంకు కార్యకలాపాలు నిలిచిపోయాయి. కేరళ ఆర్‌టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. మధ్యప్రదేశ్‌ రాజధాని భోపాల్‌లో ప్రభుత్వ రంగ బ్యాంకులు, పోస్టాఫీసుల్లో కార్యకలాపాలు స్తంభించిపోయాయి. బ్యాంకుల ప్రైవేటీకరణను నిరసిస్తూ ఎంపీ నగర్‌లో ఉద్యోగ సంఘాలు భారీ ర్యాలీ నిర్వహించాయి. కేంద్రం ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని నినదించారు.

ముంబయిలో స్తంభించిన రవాణా

ముంబయిలో భారత్​ బంద్‌తో రవాణా వ్యవస్థకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఆందోళనకారులు రోడ్లపై టైర్లకు నిప్పంటించారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలను వ్యతిరేకిస్తూ భారత్‌ పెట్రోలియం కార్పోరేషన్ లిమిటెడ్‌ ఉద్యోగులు బంద్‌లో పాల్గొన్నారు. చెన్నైలోని మౌంట్‌ రోడ్డులో 10 యూనియన్లకు చెందిన కార్మిక సంఘాలు బంద్‌లో పాల్గొన్నాయి.

ఒడిశాలో రవాణా వ్యవస్థ స్తంభించింది. ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు మూతపడ్డాయి. భువనేశ్వర్‌లో కార్మిక సంఘాల నేతలు రైలు పట్టాల పైకి చేరి రైలు రోకో నిర్వహించారు. పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కర్ణాటక, రాజస్థాన్​, తమిళనాడు, పుదుచ్చేరి సహా పలు రాష్ట్రాల్లో బంద్​ ప్రశాంతంగా జరిగింది.

బంద్​ ఎందుకు?

ఈనెల రెండో తేదీన జరిగిన సమావేశంలో కార్మికుల డిమాండ్లపై భరోసా ఇవ్వడానికి కేంద్ర కార్మికశాఖ నిరాకరించింది. దీనితో కార్మిక సంస్కరణలు, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు సహా కేంద్ర ప్రభుత్వం పలు ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తోందని ఆరోపిస్తూ కార్మిక సంఘాలు నేడు దేశవ్యాప్త బంద్‌కు పిలుపునిచ్చాయి.

ABOUT THE AUTHOR

...view details