చదివేది తొమ్మిదో తరగతి! అబ్బాయిలతో మితిమీరిన స్నేహం.. మాదక ద్రవ్యాలకూ బానిసైంది. ఇవి వద్దని వారించినందుకు తండ్రినే చంపిందా కూతురు. కర్ణాటక బెంగళూరులో జరిగిందీ ఘటన.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజాజీనగర్ ఐదోబ్లాక్‌లో వస్త్ర వ్యాపారి జయకుమార్.. తన భార్య, కుమార్తె, కుమారుడితో కలిసి నివసించేవారు. కుమార్తె తొమ్మిదో తరగతి చదువుతోంది. బీకాం చదువుతున్న ప్రవీణ్‌తో ఆ బాలిక స్నేహం చేస్తోంది. ఈ తరుణంలోనే మాదక ద్రవ్యాలు సేవించడం అలవాటైంది. పదే పదే ప్రవీణ్ తమ ఇంటికి రావడాన్ని ఆమె తండ్రి గమనించారు. తరచూ చరవాణిలో అతడితో మాట్లాడుతున్న కుమార్తెను హెచ్చరించారు.
అడ్డు తొలగించుకోవాలని... పక్కా స్కెచ్
మగపిల్లాడితో స్నేహం మానుకోవాలని జయకుమార్ పదే పదే చెప్పగా.. ఆమె తన తండ్రిపై కోపం పెంచుకుంది. ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకుంది. ఆదివారం(ఆగస్టు 18న) ఉదయం బాలిక తల్లి, తమ్ముడు పాండిచ్చేరి వెళ్లారు. వాళ్లను రైలు ఎక్కించేందుకు స్టేషన్‌కు బయల్దేరేముందు ఆ బాలిక నిద్రమాత్రలు కలిపిన పాలను తండ్రికి ఇచ్చింది.
తిరిగి వచ్చి.. తండ్రి నిద్రపోవడం చూసిన ఆమె ప్రవీణ్‌కు ఫోన్ చేసి ఇంటికి రప్పించింది. ఇద్దరూ కలిసి బాలిక తండ్రిని కత్తులతో పొడిచారు. అనంతరం గొంతు కోసి మృతదేహాన్ని మరుగుదొడ్డిలోకి తీసుకెళ్లారు. పడకగదిలో రక్తం మరకల్ని శుభ్రం చేశారు. ప్రవీణ్ బయటకు వెళ్లి రెండు లీటర్ల పెట్రోల్ తీసుకొచ్చాడు. మృతదేహంపై ఇద్దరూ పెట్రోలు పోసి నిప్పంటించారు. వారిద్దరికీ మంటలు అంటుకొని గాయపడ్డారు.
నిజం బయటపెట్టిన పోలీసులు...
మంటలు వ్యాపించాక బాలిక మిద్దె మీదకు వెళ్లి కేకలు వేసింది. చుట్టుపక్కలవారు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వగా మంటల్ని అదుపులోకి తీసుకొచ్చారు. వారితో పాటు అక్కడకి వచ్చిన పోలీసులు కూపీ లాగారు. బాలికను, ప్రవీణ్‌ను చికిత్స కోసం విక్టోరియా ఆసుపత్రికి తరలించారు. బంధువుల ఇంటికి వెళ్లి అల్పాహారం తిని వచ్చేలోపు మంటలు లేచాయని బాలిక పోలీసులకు తెలిపింది. పోలీసులు గట్టిగా ప్రశ్నించగా అసలు విషయం బయటపెట్టింది.