'అన్నా.. కాకరపువ్వొత్తి నువ్వు తిను, ఈ చిచ్చుబుడ్డేమో నేను తింటా' అంటుంది ఓ ఇంట్లో చెల్లి. మరో ఇంట్లో 'వదినా ఈ రాకెట్ తిని చూడు ఎంత రుచిగా ఉందో' అంటుందో మరదలు. స్నేహితులతో ఉన్న ఓ కుర్రాడు ' ఒరేయ్ మామా.. ఆ లక్ష్మీ బాంబు, భూ చక్రాలు ఇంకొన్ని కొనుక్కొచ్చి తిందాంరా!' అంటున్నాడు. అవును ఈ సారి దీపావళికి చాలా ఇళ్లల్లో ఇలాంటి మాటలే వినిపించబోతున్నాయి. ఎందుకంటే ఇప్పుడు నోట్లో వేసుకుంటే కరిగిపోయే మిఠాయి పటాసులు మార్కెట్లోకి వచ్చేశాయి మరి.
చాక్లెట్ దీపావళి..
దీపావళి అంటే అచ్చంగా దీపాల పండగే. కానీ, మనం పండుగ ప్రాముఖ్యం తెలుసుకోక రణగొణ ధ్వనులు చేసే టపాసులు పేల్చుతున్నాం. విషపూరిత వాయువులతో ప్రకృతిని నాశనం చేస్తూ పండుగ అర్థాన్నే మార్చేస్తున్నాం. అందుకే పర్యావరణానికి హాని కలిగించకుండా బెంగళూరులోని ఔబ్రీ సంస్థ ఈ ప్రత్యేకమైన చాక్లెట్ టపాసులను తయారు చేసింది.
ఈ మిఠాయి కొట్టులో నోరూరించే టపాసులు దొరుకుతాయి. అయితే అవి శబ్దాలు చేయవు, మంటలు పుట్టించవు. కడుపు నింపుతాయి. సంతోషాలు పంచుతాయంతే. అందుకే చిన్నాపెద్దా తేడా లేకుండా ఎగబడి మరీ వీటిని కొనేస్తున్నారు.