బంగాల్ అధికార పార్టీ టీఎంసీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా. బంగాల్ సంస్కృతికి మమతా బెనర్జీ పాలనలో ముప్పు వాటిల్లిందని ధ్వజమెత్తారు. బయటి వ్యక్తులు, లోపలి వ్యక్తులు అంటూ సమాజాన్ని విడదీయాలని ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.
బీర్భూమ్ జిల్లాలోని తారాపీఠ్ నుంచి పరివర్తన్ యాత్ర రెండో దశను ప్రారంభించిన నడ్డా.. రాష్ట్ర రాజకీయాలను టీఎంసీ నేరపూరితం చేసిందని మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో అధికారం చేపడతామని ధీమా వ్యక్తం చేశారు.
"బంగాల్‌కు ఉన్న గొప్ప సంస్కృతి, వారసత్వం మమతా బెనర్జీ పాలనలో ప్రమాదంలో పడింది. వీటిని భాజపా మాత్రమే కాపాడగలదు. బయటివారు, లోపలివారు అంటూ తృణమూల్ కాంగ్రెస్ ఒక్కొక్కరిపై ముద్రలు వేస్తోంది. ఇది సిగ్గుచేటు. లోపలి వ్యక్తులు-బయటి వ్యక్తులు అనే సంస్కృతి బంగాల్ది కాదు. స్వామి వివేకానంద, రవీంద్రనాథ్ ఠాగూర్ జన్మించిన నేల సంస్కృతి కాదు."
-జేపీ నడ్డా, భాజపా జాతీయ అధ్యక్షుడు
మా, మాటి, మనుష్(అమ్మ, నేల, ప్రజలు) అని నినాదమిచ్చే టీఎంసీ.. నియంతృత్వం, దోపిడీ, బుజ్జగింపు రాజకీయాల స్థాయికి దిగజారిపోయిందని ఆరోపించారు నడ్డా. బంగాల్లో నిజమైన మార్పు భాజపానే తీసుకొస్తుందని చెప్పారు.
దీదీ కౌంటర్
కేంద్రంపై అదే స్థాయిలో విమర్శలు చేశారు టీఎంసీ అధినేత్రి, బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. రాష్ట్ర ప్రభుత్వం లబ్ధిదారుల పేర్లను ఖరారు చేసి పంపినప్పటికీ.. పీఎం-కిసాన్ పథకం కింద రైతులకు నిధులు మంజూరు చేయలేదని ఆరోపించారు. నిధులను తానే అడ్డుకుంటున్నానని భాజపా చేసిన వ్యాఖ్యలను తిప్పికొట్టారు. ఇప్పటికే రైతులకు రూ.5 వేల చొప్పున ఇస్తున్నామని, ఉచిత పంట బీమా కోసం కూడా ఏర్పాట్లు చేశామని చెప్పారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే రైతులకు మెరుగైన సదుపాయాలు అందిస్తున్నట్లు చెప్పుకొచ్చారు.