- దీదీ హవా కొనసాగుతుందా?
- మోదీ మంత్రం అద్భుతం చేస్తుందా?
- కోల్‌కతా పీఠం ఎవరికి దక్కుతుంది?
బంగాల్ శాసనసభ ఎన్నికలకు ఇంకా అనేక నెలలు సమయం ఉన్నా... ఇప్పటినుంచే చర్చనీయాంశమైన ప్రశ్నలివి. అందుకు తగినట్టే ఆ రాష్ట్ర రాజకీయాలు క్రమంగా వేడెక్కుతున్నాయి. అధికారం నిలబెట్టుకునే లక్ష్యంతో తృణమూల్ కాంగ్రెస్ పదునైన వ్యూహాలు రచిస్తోంది. గత లోక్‌సభ ఎన్నికల్లో అత్యుత్తమ ఫలితాలు అందుకున్న భాజపా.. ఈసారి బంగాల్లో పాగా వేయాలన్న పట్టుదలతో పనిచేస్తోంది.
ఇలాంటి సమయంలో బంగాలీవాదం తెరపైకి వచ్చింది. అంతేకాదు బంగాలీల ఆత్మగౌరవం, స్థానికులు వర్సెస్ ఔట్‌సైడర్స్ పేరిట పెద్ద యుద్ధానికే తెరలేచింది. బంగాల్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా.. ప్రస్తుతం రాష్ట్రంలో ఉద్యోగాలు, విద్యలో స్థానికులకు రిజర్వేషన్ ఇవ్వాలన్న గళం పెరుగుతోంది. ఇదే అదునుగా అధికార టీఎంసీ లోకల్ సెంటిమెంట్‌ను ఎన్నికల అస్త్రంగా మలుచుకుంటుంటే... భాజపా ప్రతివ్యూహాలు రచిస్తోంది.
రూటు మార్చిన రాజకీయం
'లోకల్' మంత్రం బంగాల్‌కు చాలా కొత్త. కానీ ఇప్పుడు ఒక్కసారిగా 'బంగాలీ ఆత్మగౌరవం' తెరపైకి రావడానికి ప్రధాన కారణం భాజపా.
2019 లోక్‌సభ ఎన్నికల్లో బంగాల్లో ప్రభంజనం సృష్టించింది భాజపా. ఆ రాష్ట్రంలోని మొత్తం 42 స్థానాల్లో ఏకంగా 18 సీట్లు కైవసం చేసుకుంది. టీఎంసీని 22 సీట్లకే పరిమితం చేసి, ఊహించని దెబ్బ కొట్టింది. మిగిలిన 2 స్థానాలు కాంగ్రెస్‌కు దక్కాయి.
2014 సార్వత్రిక ఎన్నికల్లో బంగాల్లో భాజపా గెలిచింది 2 సీట్లే. అలాంటి పార్టీ 2019లో అనూహ్యంగా పుంజుకున్నాక... రాష్ట్ర రాజకీయం రూపు మారింది. హిందుత్వ శక్తుల దూకుడు పెరిగింది. ఉత్తరాది రాష్ట్రాలతో పోల్చితే బంగాల్లో పెద్దగా ప్రాచుర్యం లేని శ్రీరామ నవమి వంటి పండుగలకు భారీ స్థాయిలో ర్యాలీలు నిర్వహించే సంస్కృతి మొదలైంది. ఆ ర్యాలీల సందర్భంగా వేర్వేరు వర్గాల మధ్య ఘర్షణలు జరగడం... రాజకీయ వేడిని మరింత పెంచింది.
ఇలాంటి పరిస్థితుల్లో బంగ్లా పొఖ్ఖో, జాతియో బంగ్లా సమ్మేళన్, బంగ్లా సంస్కృతి మంచా వంటి బంగాలీ సంఘాలు రంగంలోకి దిగాయి. ఉత్తరాది సంస్కృతిని, హిందీని బంగాల్పై బలవంతంగా రుద్దుతున్నారని అభ్యంతరం చెప్పడం ప్రారంభించాయి.
"శ్రీరామ నవమి సంబరాల నిర్వహణతోనే ఇబ్బందులు మొదలయ్యాయి. బంగాలీయేతరులు బంగాలీలను బెదిరిస్తున్న తీరు చూస్తుంటే... జనాభాపరంగా మాత్రమే కాక సాంస్కృతికంగానూ మేము మైనారిటీలుగా మారే రోజులు ఎంతో దూరంలో లేవని అనిపిస్తోంది."
-కౌశిక్ మైతీ, బంగ్లా పొఖ్ఖో సీనియర్ నేత
ఇదే సమయంలో టీఎంసీతో తమకు ఎలాంటి సంబంధం లేదన్నారు కౌశిక్. స్థానికులకు ఉద్యోగాలు, విద్యలో రిజర్వేషన్లు కల్పించాలని ఎప్పటినుంచో తమ సంస్థ ఉద్యమిస్తోందని చెప్పుకొచ్చారు.
"బంగాలీ ఆత్మగౌరవం గురించి మేము ఎందుకు మాట్లాడకూడదు? గుజరాతీలు వాళ్ల నేపథ్యం గురించి ఘనంగా చెప్పుకుంటారు. తమిళులూ అంతే. మరి మేము అలా ఎందుకు చేయకూడదు? స్థానికత ఆధారంగా చాలా రాష్ట్రాల్లో రిజర్వేషన్ ఉంది. బంగాల్‌కు ఎందుకు ఉండకూడదు?"
-అనిర్బన్ బెనర్జీ, జాతియో బంగ్లా సమ్మేళన్ ప్రతినిధి
బంగాలీల ఆర్థిక, సామాజిక హక్కుల పరిరక్షణే లక్ష్యంగా తమ సంస్థ పనిచేస్తోందని చెప్పారు బెనర్జీ.
ఆ వివాదాలతో తెరపైకి...
బంగాలీ సంస్థలు రాజకీయంగా ఇంత కీలకం కావడం 2017లోనే మొదలైంది. అప్పట్లో పోలీస్ కానిస్టేబుళ్ల నియామక పరీక్షలకు హిందీ, ఉర్దూను మాధ్యమంగా చేర్చాలన్న ప్రతిపాదనను గట్టిగా వ్యతిరేకించాయి. చివరకు అలా జరగకుండా అడ్డుకున్నాయి.
2019 సార్వత్రిక ఎన్నికల ప్రచారం తుది దశ ప్రచారంలో భాజపా ర్యాలీ సందర్భంగా సామాజికవేత్త ఈశ్వర చంద్ర విద్యాసాగర్ విగ్రహం ధ్వంసం, అసోం ఎన్ఆర్సీలో బంగాలీలు సహా మొత్తం 12 లక్షల మంది హిందువుల పేర్లు గల్లంతయ్యాయన్న వాదనలు... బంగాలీ సంస్థలు దూకుడు పెంచేందుకు కారణమయ్యాయి.