బంగాలీల నోరూరించే వంటలు, వంటల రెసిపీల ప్రత్యేకతే వేరు. అలాంటి వారి ఆహార పదార్థాల్లో ఎప్పుడో గానీ లేకుండా ఉండదు ఓ ప్రత్యేక పిండివంటకం. శంఖాకారంలో ఉండే అందమైన అలంకరణలతో తీర్చిదిద్దిన ఆ ప్రత్యేక వడియమే "గోయ్నా బోరీ”. సీతాకోక చిలుకలు, బాతులు, చిలుకలు, నెమళ్లతో పాటు చెవి రింగులు, గాజులు, చేతి కడియాలు, ఇలా ఎన్నో రూపాల్లో వాటిని తయారు చేస్తారు. విభిన్న ఆకృతుల్లో లభించే ఆ వడియాలు దశాబ్దాలుగా బంగాలీల రోజువారీ ఆహారంలో ఒకభాగంగా మారిపోయాయి.
ఈ సంప్రదాయ వంటకం తూర్పుమేదినిపూర్ జిల్లాకే ప్రత్యేక గుర్తింపు తెచ్చిపెట్టింది. ఆ జిల్లాలోని తమ్లక్, మహిషాదల్, నందకుమార్, మోయ్నా ప్రాంత మహిళలు గోయ్నాబోరీల తయారీలో నైపుణ్యం సాధించారు.
తయారీ విధానం
బంగాలీ కార్తీకమాసంలో మినప, పెసర మరికొన్ని పప్పులు కలిపి రుబ్బి , ఆభరణాల రూపంలో మలిచి పైన గసగసాల పొర అద్దుతారు. ఈ వంటల సీజన్ ప్రారంభంలో పూజారుల సమక్షంలో ఆ వడియాలకు పెళ్లి లాంటి ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తారు.
"తెల్లవారు జామున 2గంటలకు నిద్రలేచి 45నిమిషాల పాటు పప్పులు నాన బెడతాం. తర్వాత ఒకరు పిండిని... మరొకరు దానికి అల్లం, జీలకర్ర, మిర్చీ, మసాలా కలుపుతారు. ఆ పని ఉదయం 6గంటల వరకు కొనసాగుతుంది. అనంతరం వడియాల తయారీ మొదలు పెడతాం. "