తెలంగాణ

telangana

ETV Bharat / bharat

అక్రమ బాంబుల తయారీకి అడ్డాగా బంగాల్​: ధన్​ఖర్​​ - బంగాల్​లో అల్​ఖైదా ఉగ్రవాదుల అరెస్టు

పశ్చిమ్​ బంగా ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు గవర్నర్​ జగదీప్​ ధన్​ఖర్​​. రాష్ట్రంలో ఎన్​ఐఏ ఉగ్రవాదులు పట్టుబడిన అనంతరం.. 'బంగాల్​ అక్రమ బాంబుల తయారీకి అడ్డా'గా మారిందని ఆరోపించారు. దీదీ ప్రభుత్వ పాలనా వైఫల్యాలే దీనికి కారణమని విమర్శించారు. ఎన్​ఐఏ ఇవాళ ఉదయం జరిపిన దాడుల్లో మొత్తం 9 మంది అల్​ఖైదా ఉగ్రవాదులు పట్టుబడ్డారు.

Bengal has become home to illegal bomb-making: Dhankhar on NIA arrests
అక్రమ బాంబుల తయారీకి అడ్డాగా బంగాల్​: ధన్​కర్​

By

Published : Sep 19, 2020, 4:26 PM IST

అల్​ఖైదా ఉగ్రవాదుల అరెస్టు అనంతరం బంగాల్​ ప్రభుత్వంపై మండిపడ్డారు​ గవర్నర్​ జగదీప్​ ధన్​ఖర్​. 'అక్రమ బాంబుల తయారీకి పశ్చిమ్​ బంగా' నిలయంగా మారిందని ఆరోపించారు. రాష్ట్రంలో శాంతిభద్రతల క్షీణతపై ఆందోళన వ్యక్తం చేసిన ఆయన.. అధికార యంత్రాంగం దీనికి జవాబుదారీతనంగా ఉండాలని అన్నారు. జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్​ఐఏ) భారీ ఉగ్ర కుట్ర భగ్నం చేసిన అనంతరం.. గవర్నర్​ ఈ వ్యాఖ్యలు చేశారు.

ఈ ఉదయం దేశవ్యాప్తంగా నిర్వహించిన దాడుల్లో బంగాల్​, కేరళ నుంచి 9 మంది ముష్కరుల్ని ఎన్​ఐఏ అరెస్టు చేసింది. వారి నుంచి భారీగా పేలుడు పదార్థాల తయారీకి సంబంధించిన మెటీరియల్​, తుపాకులను స్వాధీనం చేసుకుంది.

ఈ నేపథ్యంలోనే బాంబుల తయారీని అక్రమంగా నిర్వహించే ఉగ్ర ముఠాలకు బంగాల్​ అడ్డాగా మారిందని ధన్​ఖర్ ట్వీట్​ చేశారు. ప్రజాస్వామ్యాన్ని అస్తవ్యస్తం చేసే ఇలాంటి కార్యకలాపాలను అడ్డుకోవడంలో మమత ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు.

బంగాల్​ గవర్నర్​ ట్వీట్​

''ప్రజాస్వామ్యాన్ని అస్తవ్యస్తం చేసే సామర్థ్యం ఉన్న అక్రమ బాంబుల తయారీకి బంగాల్​ నిలయంగా మారింది. రాజకీయ తప్పిదాలు చేసి.. వాటిని ప్రతిపక్షాల మీద రుద్దడంలో పోలీసులు తీరిక లేకుండా ఉన్నారు. శాంతి భద్రతలు క్షీణించడంపై వీరే బాధ్యత వహించాలి.''

- జగదీప్​ ధన్​ఖర్​, బంగాల్​ గవర్నర్​

ప్రభుత్వంతో చాలా కాలంగా మాటల యుద్ధం నేపథ్యంలో గవర్నర్​ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఎన్నో అంశాల్లో దీదీ, గవర్నర్ పరస్పరం విమర్శించుకుంటూ వస్తున్నారు.

వారంతా బంగాల్​ నుంచే..

ఎన్​ఐఏ సోదాల్లో పట్టుబడ్డ 9 మంది ఉగ్రవాదుల స్వస్థలం బంగాలేనని తెలిసింది. మొత్తం ముర్షిదాబాద్​ నుంచి ఆరుగురు, కేరళలోని ఎర్నాకుళం నుంచి ముగ్గురిని అరెస్టు చేసింది ఎన్​ఐఏ. వీరు సామాజిక మాధ్యమాల ద్వారా ఉగ్రవాదం పట్ల ఆకర్షితులై దేశంలో అల్‌ఖైదా బేస్‌ను ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు తమ ప్రాథమిక విచారణలో తేలిందని ఎన్​ఐఏ వివరించింది.

ఉగ్రవాదులు బాణసంచాలో వాడే నల్లమందును ఐఈడీలుగా మార్చేందుకు ప్రయత్నించినట్లు ఎన్​ఐఏ ప్రాథమిక విచారణలో తేలింది. దిల్లీ సహా దేశవ్యాప్తంగా పేలుళ్లు జరిపి అమాయకులని బలితీసుకోవడం ద్వారా దేశంలో భయభ్రాంతులు సృష్టించాలన్నదే వీరి లక్ష్యమని ఎన్​ఐఏ గుర్తించింది.

ఈ అరెస్టులతో దేశంలో ఉగ్రదాడులు జరిగే అవకాశాన్ని నిరోధించినట్లు జాతీయ దర్యాప్తు సంస్థ పేర్కొంది. ఉగ్రమూక నుంచి భారీఎత్తున దస్త్రాలను, డిజిటల్ డివైస్‌లను, జిహాది సాహిత్యాన్ని, పదునైన ఆయుధాలను, దేశీయంగా తయారైన తుపాకులు, శరీర కవచాలు, ఇంట్లోనే పేలుడు పదార్థాలు తయారు చేయడానికి అవసరమైన పరిజ్ఞానంతో కూడిన మెటీరియల్‌ తదితరాలను స్వాధీనం చేసుకుంది ఎన్​ఐఏ. ఈ ఉగ్రవాదులకు పాకిస్థాన్ సహా విదేశాల నుంచి ఆదేశాలు అందుతున్నట్లు తేలిందని చెప్పింది.

ABOUT THE AUTHOR

...view details