తెలంగాణ

telangana

ETV Bharat / bharat

బంగాల్​పై భాజపా గురి- దీదీని దించేందుకు పక్కా స్కెచ్​ - దీదీ తాజా వార్తలు

2021లో జరిగే బంగాల్​ అసెంబ్లీ ఎన్నికలపైనే ప్రస్తుతం భాజపా దృష్టి అంతా. 2019 లోక్​సభ ఎన్నికల్లో ఊహించని రీతిలో భాజపా బంగాల్​లో 18 సీట్లు గెల్చుకుంది. అదే ఊపును రానున్న అసెంబ్లీ పోరులోనూ కొనసాగించాలని భావిస్తోంది. మరి దీదీని దించడానికి భాజపా వ్యూహాలేంటి?

'Bengal BJP evaluating leaders' performance, set for major   overhaul
బంగాల్​పై భాజపా గురి- దీదీని దించేందుకు పక్కా స్కెచ్​

By

Published : Mar 1, 2020, 5:41 PM IST

Updated : Mar 3, 2020, 2:02 AM IST

మమతా బెనర్జీ... 2011 నుంచి బంగాల్​ సీఎం. ఆ రాష్ట్రంలో తిరుగులేని నేత. బంగాల్​లో పాగా వేయాలని భావిస్తోన్న భాజపాకు ఆమె ఓ కొరకరాని కొయ్య.

అయితే వరుసగా రెండోసారి మోదీ సర్కారు గద్దెనెక్కడం, లోక్​సభ ఎన్నికల్లో పార్టీ గణనీయంగా పుంజుకోవడం.. కమలదళానికి నూతనోత్సాహాన్ని ఇచ్చాయి. దీదీని దించేయడానికి 'ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు?' అని కమలనాథులు కదం తొక్కుతున్నారు. మరి బంగాల్​లో భాజపా పాచిక పారుతుందా? దీదీని అడ్డుకోవడం సాధ్యమేనా?

వ్యూహాలకు పదును...

వచ్చే ఏడాది జరగనున్న శాసనసభ ఎన్నికలను సమర్థంగా ఎదుర్కొనేందుకు బంగాల్​ భాజపా ఇప్పటినుంచే వ్యూహాలు రచిస్తోంది. రాష్ట్ర భాజపా అధ్యక్షుడిగా దిలీప్ ఘోష్ రెండవసారి ఎన్నికైన తరువాత పార్టీ పునర్​వ్యవస్థీకరణపై దృష్టి సారించారు.

ఇదే సరైన సమయం...

కొన్నేళ్ల ముందు వరకు బంగాల్​లో భాజపా అంత బలమైన పార్టీగా లేదు. అయితే మారిన రాజకీయ సమీకరణాలతో రాష్ట్రంలో కమలదళం శక్తిమంతమైంది.

సంస్థాగతంగా మరింత వ్యూహాత్మకంగా, ప్రణాళికతో ముందుకు సాగితే బంగాల్ లో కాషాయం రెపరెపలాడడం పెద్ద కష్టమేమీ కాదన్నది పార్టీ పెద్దల విశ్వాసం.

ప్రక్షాళన...

ఇందుకోసం పార్టీలో ప్రక్షాళనా కార్యక్రమాన్ని రాష్ట్ర భాజపా చేపట్టనుంది. పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించని నాయకులను కీలక పదవుల నుంచి తప్పించి వారి స్థానంలో సమర్థులైన యువకులకు బాధ్యతలు అప్పగించాలని యోచిస్తోంది.

కొత్త, పాతల కలయిక...

ప్రక్షాళన అనంతరం పార్టీ కార్యవర్గం పాత, కొత్తల మిశ్రమ కలయికగా ఉండబోతుందని సీనియర్ నేత ఒకరు తెలిపారు. భాజపా-ఆర్​ఎస్​ఎస్​ నేపథ్యం ఉన్న వారికే కాకుండా టీఎం​సీ సహా ఇతర పార్టీలనుంచి వచ్చిన వారికీ అవకాశం కల్పించాలని భావిస్తోంది.

పార్టీ ఎన్నికల కమిటీని వ్యూహాత్మకంగా వ్యవహరించే వారితో నింపాలని భాజపా భావిస్తోంది. ప్రస్తుతం పార్టీలో ఉన్న నేతల పనితీరును క్షుణ్నంగా అధ్యయనం చేసి ఎన్నికల కమిటీలో చోటు కల్పించాలని పార్టీ అధిష్ఠానం యోచిస్తోంది.

అధ్యక్షుల మార్పు...

అఖిల భారత విద్యార్థి పరిషత్​ (ఏబీవీపీ), విశ్వ హిందూ పరిషత్​ (వీహెచ్​పీ) నుంచి చురుకైన వారికి పార్టీలో స్థానం కల్పించాలని అనుకుంటున్నారు భాజపా అగ్ర నేతలు. పార్టీలో మార్పులకు గత డిసెంబరులో జరిగిన అంతర్గత ఎన్నికలు నాంది పలికాయి. రాష్ట్రంలోని 39 జిల్లాల పార్టీ అధ్యక్షుల్లో 15 మందిని ఈ ఎన్నికల ద్వారా మార్చారు.

భాజపాను దీటుగా ఎదుర్కొనేందుకు అంతే స్థాయిలో ప్రణాళికలు రచిస్తున్నారు మమత. ఈ రెండు ప్రధాన పార్టీల వ్యూహాల్లో ఏది ఫలిస్తుందో వేచి చూడాలి.

Last Updated : Mar 3, 2020, 2:02 AM IST

ABOUT THE AUTHOR

...view details