తెలంగాణ

telangana

ETV Bharat / bharat

బంగాల్​ దంగల్​: ప్రచార అస్త్రాలపై భాజపాలో భిన్నస్వరాలు

బంగాల్​ అసెంబ్లీ ఎన్నికలకు పదునైన వ్యూహాలు, బలమైన అస్త్రాలను భాజపా సిద్ధం చేస్తోంది. స్థానిక ఎన్నికలనే మినీ అసెంబ్లీగా భావించి గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగనుంది. అయితే ప్రచారాస్త్రాలపై మాత్రం పార్టీలో భిన్నస్వరాలు వినిపిస్తున్నాయి. ఎందుకు అలా?

Bengal BJP divided on strategy for 2021 state polls
బంగాల్​ దంగల్​: ప్రచార అస్త్రాలపై భాజపాలో భిన్నస్వరాలు

By

Published : Mar 2, 2020, 9:03 AM IST

Updated : Mar 3, 2020, 3:13 AM IST

"మోదీకి ఎదురేలేదు... ఎక్కడ చూసినా కాషాయ ప్రభంజనమే.. వ్యూహరచనలో షా-మోదీ ద్వయాన్ని మించినోళ్లు లేరు"... రెండేళ్ల కిందట భాజపా విజయాలను చూసిన ఎందరో రాజకీయ విశ్లేషకులతో పాటు సామాన్య జనం నోట వచ్చిన మాటలివి. నిజంగా అంతలా ఆధిపత్యం ప్రదర్శించింది భాజపా.

అయితే లోక్​సభ ఎన్నికల్లో భాజపాకు తిరుగులేకపోయినా.. రాష్ట్ర ఎన్నికల్లో మాత్రం పరిస్థితి భిన్నం. ఇందుకు తాజా దిల్లీ అసెంబ్లీ ఎన్నికలే నిదర్శనం.

బంగాల్​లో భిన్నస్వరాలు...

దిల్లీ శాసనసభ ఎన్నికల్లో పరాజయం తర్వాత బంగాల్​లో అనుసరించాల్సిన వ్యూహంపై రాష్ట్ర భాజపాలో భిన్నస్వరాలు వినిపిస్తున్నాయి. బంగాల్ శాసనసభకు వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్నాయి.

ఆర్టికల్ 370 రద్దు, ముమ్మారు తలాక్, పౌరసత్వ చట్ట సవరణ, జాతీయ పౌర పట్టిక (ఎన్ఆర్​సీ​ ) వంటి జాతీయ అంశాలతో ముందుకు వెళ్లాలని ఒక వర్గం భావిస్తోంది. అయితే పార్టీలో మరో వర్గం మాత్రం ప్రత్యామ్నాయ ప్రచారాంశాలతో, రాష్ట్ర సమస్యలనే ప్రధానంగా ప్రస్తావించాలని పట్టుపడుతోంది.

అధిష్ఠానం దారెటు?

అక్రమ వలసదారుల సమస్య బంగాల్​కు వర్తిస్తుందని కొంతమంది సీనియర్​ నేతల అభిప్రాయం. సీఏఏ, ఎన్​ఆర్​సీ వంటి వాటి గురించి గత లోక్​సభ ఎన్నికలలో విస్తృత ప్రచారం చేయబట్టే ప్రజలు భాజపాకు మంచి ఫలితాలు ఇచ్చారన్న విషయం మరువరాదన్నది వారి వాదన.

సీఏఏ, ఎన్ఆర్​సీలను దీదీ తీవ్రంగా వ్యతిరేకిస్తూ ప్రచారం సాగిస్తోన్న సమయంలో తాము ఆ విషయాలకు ప్రాధాన్యం ఇవ్వకపోతే ప్రజలలో తప్పుడు సంకేతాలు వెళ్తాయని వారు అభిప్రాయపడుతున్నారు.

జాతీయ అంశాలతో పాటు బంగాల్​లో తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు, రాష్ట్రానికి ప్రయోజనం చేకూర్చే పథకాలు వంటి వాటిపై ప్రధానంగా దృష్టి సారిస్తే మెరుగైన ఫలితాలు ఉంటాయని కేంద్ర అధిష్ఠానం భావిస్తున్నట్లు సమాచారం.

దిల్లీ భయం...

2019 లోక్​సభ ఎన్నికలలో దిల్లీలోని మొత్తం ఏడు నియోజక వర్గాల్లోనూ భాజపా విజయబావుటా ఎగురవేసింది. కొద్ది నెలల అనంతరం జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో మాత్రం ఆమ్ఆద్మీకే దిల్లీ ప్రజలు పట్టం కట్టారు. ఇప్పుడు బంగాల్​ భాజపా వర్గాలను దిల్లీ ఫలితం కలవరపెడుతోంది.

గత లోక్​సభ ఎన్నికల్లో బంగాల్​లోని మొత్తం 42 లోక్​సభ నియోజక వర్గాలలో 18 చోట్ల విజయం సాధించింది భాజపా.

మినీ అసెంబ్లీ...

ఈ ఏడాది జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలను వచ్చే సంవత్సరం రాబోయే అసెంబ్లీ పోరుకు సెమీఫైనల్స్​గా పరిగణిస్తున్నాయి పార్టీలు. స్థానిక ఎన్నికల ఫలితం ఆధారంగా వ్యూహాల్లో అవసరమైన మార్పులు చేయాలని భావిస్తున్నాయి.

మాకు కూడా చెప్పండి...

ప్రజలు నేరుగా తమ సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చేందుకు 'దీదీ కే బోలో' కార్యక్రమాన్ని టీఎమ్​సీ సర్కార్ ప్రారంభించింది. తృణమూల్ కాంగ్రెస్ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ సూచన మేరకు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

టీఎంసీ తీసుకొచ్చిన 'దీదీ కే బోలో' తరహాలోనే 'భాజపా కే బోలో' కార్యక్రమాన్ని తీసుకురావాలని కమలనాథులు యోచిస్తున్నారు.

ఈ కార్యక్రమంలో భాగంగా ఒక హెల్ప్ లైన్ నంబర్​ను భాజపా ఏర్పాటు చెయ్యనుంది. ప్రజలు ఆ నంబరుకు ఫోన్ చేసి తమ సమస్యలు చెప్పుకోవచ్చని పేర్కొంది.

Last Updated : Mar 3, 2020, 3:13 AM IST

ABOUT THE AUTHOR

...view details