బిహార్ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న క్రమంలో రాష్ట్రంలో రాజకీయ వేడి రాజుకుంటోంది. భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు.. లోక్‌జనశక్తి పార్టీ రాసిన లేఖను బహిరంగపరచటం రాష్ట్రంలో రాజకీయ వేడిని మరింత పెంచుతోంది. రాష్ట్రంలో ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌కు ప్రతికూల పవనాలు వీస్తున్నాయని, అది అధికార కూటమి ఓటమికి దారితీసే ప్రమాదం ఉందని పేర్కొంటూ సెప్టెంబర్ 24న నడ్డాకు లేఖ రాశారు ఎల్జేపీ అధినేత చిరాగ్ పాసవాన్. ఎన్డీఏ ముఖ్యమంత్రి అభ్యర్థిగా కాషాయ పార్టీ నాయకుడిని ప్రకటించాలని కోరారు.
చిరాగ్ పాసవాన్ లేఖను గురువారం విడుదల చేసింది ఎల్జేపీ. రాజ్యసభకు తన తండ్రి రామ్ విలాస్ పాసవాన్‌ను ఎన్నుకునే సమయంలో నితీశ్ కుమార్ అవమానపరిచారని లేఖలో పేర్కొన్నారు చిరాగ్. అలాగే.. ఆయన అనారోగ్యానికి గురైనప్పుడు ప్రధాని మోదీ తరుచూ ఫోన్ చేసి ఆరోగ్యంపై ఆరా తీశారని, కానీ.. నితీశ్ ఒక్కమాట కూడా మాట్లాడలేదన్నారు. సీఎం పనితీరుపట్ల చాలా మంది భాజపా నాయకులు అసంతృప్తిగా ఉన్నారని తెలిపారు. ప్రధాని మోదీ పాపులరిటీ పెరుగుతున్నప్పటికీ.. ముఖ్యమంత్రి విషయంలో అందుకు విరుద్ధంగా ఉందని సూచించారు.
ప్రస్తుతం ఈ లేఖను బహిరంగపరచటంపై ముఖ్య ఉద్దేశాన్ని వెల్లడించింది ఎల్జేపీ. బిహార్‌లో ఎన్డీఏ కూటమి నుంచి బయటకురావాలనే నిర్ణయం వెనుక ఉన్న కారణాలను భాజపాకు వివరించేందుకే లేఖ రాసినట్లు తెలిపాయి పార్టీ వర్గాలు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 243 స్థానాలకు గాను 143 స్థానాల్లో పోటీ చేయాలని నిర్ణయించింది ఎల్జేపీ. జేడీయూ ఎక్కడైతే పోటీ చేస్తుందో ఆ స్థానంలో తాము బరిలో దిగుతామని వెల్లడించింది. కానీ, భాజపా స్థానాల్లో పోటీ చేయబోమని స్పష్టం చేసింది.