కరోనా బాధితుల చికిత్స కోసం 20 వేల రైలు బోగీలు అందుబాటులో ఉండేలా చూసుకోవాలని జోనల్ శాఖలకు రైల్వే బోర్డు సూచించింది. రైలు బోగీలను ఐసోలేషన్ వార్డులుగా ఉపయోగించే అవకాశం ఉందని తెలిపింది. అందుకు తగినట్లు బోగీల్లో మార్పులు చేసేందుకు సిద్ధంగా ఉండాలని ఆదేశించింది.
తొలుత 5 వేల బోగీలు అవసరమవుతాయని జోనల్ జనరల్ మేనేజర్లకు రైల్వే బోర్డు తెలిపింది. వాటిని సిద్ధం చేయాలని ఆదేశించింది. ఈ నిర్ణయం తీసుకునే ముందు సాయుధ బలగాల వైద్య సేవలు, జోనల్ రైల్వే వైద్య విభాగాలు, ఆయుష్మాన్ భారత్తో సంప్రదింపులు జరిపింది. ఇప్పటికే 5 జోనల్ రైల్వేలు ప్రొటో టైప్ ఐసోలేషన్ బోగీలను సిద్ధం చేశాయి.