కశ్మీర్ అంశంలో ఏ దేశమూ, ఏ విదేశీ నేత కలగజేసుకోవాల్సిన అవసరం లేదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఉద్ఘాటించారు. కశ్మీర్ విషయం పూర్తిగా భారత్ అంతర్గతమేనని విదేశాలకు ప్రధాని నరేంద్రమోదీ స్పష్టం చేశారని గుర్తుచేశారు. మహాబలిపురంలో మోదీ-జిన్పింగ్ భేటీ ప్రారంభం కాబోతున్న సమయంలో అమిత్ షా వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
మహారాష్ట్ర శాసనసభ ఎన్నికల ప్రచారంలో భాగంగా బుల్ఢాణా జిల్లాలో జరిగిన బహిరంగ సభలో మాట్లాడారు అమిత్ షా. కశ్మీర్ విషయంలో భారత్కు ప్రతికూలంగా మాట్లాడిన బ్రిటన్ ప్రతిపక్ష నేత జెరెమీ కార్బిన్తో ప్రవాస కాంగ్రెస్ అధ్యక్షుడు కమల్ ధలివాల్ భేటీపై మండిపడ్డారు.
"కశ్మీర్ సమస్యలో ఇన్నేళ్లుగా మనం ఏం దేశం జోక్యాన్ని ఒప్పుకోలేదు. కశ్మీర్ విషయంపై ఎవరైనా ఏదైనా మాట్లాడాలని చూస్తే... అది అమెరికా అధ్యక్షుడైనా, ఇంకెవరైనా మోదీ ఒకటే చెప్పారు. కశ్మీర్ పూర్తిగా భారత్ అంతర్గత విషయం. ఇందులో ఎవరి జోక్యం అవసరం లేదు.