ఒడిశా సుప్రసిద్ధ పూరీ జగన్నాధాలయం వద్ద ఓ యాచకుడు, రిక్షా కార్మికుడికి మధ్య జరిగిన బాహాబాహీ నమ్మశక్యం కాని ఓ నిజాన్ని వెలుగులోకి తెచ్చింది. అత్యున్నతస్థాయి అధికారి కుటుంబం నుంచి వచ్చి, ఇంజినీరింగ్ చదివి, మంచి ఉద్యోగం చేసి.. చివరకు భిక్షాటన చేస్తున్న ఓ వ్యక్తిగతాన్ని కళ్లెదుట ఆవిష్కరించింది.
గొడవతో వెలుగులోకి నిజం
జగన్నాధాలయం వద్ద శుక్రవారం నాడు ఓ యాచకుడు, రిక్షా కార్మికుడికి మధ్య తగాదా జరిగింది. ఈ ఘర్షణ తీవ్రరూపం దాల్చి.. పోలీసుల వరకు చేరింది. గాయపడిన వాళ్లిద్దరినీ ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లి ప్రాథమిక చికిత్స చేయించారు అధికారులు. ఆ తర్వాత యాచకుడు లిఖిత పూర్వకంగా సమర్పించిన ఫిర్యాదును చూసి పోలీసు సిబ్బంది అవాక్కయిపోయారు.
చక్కటి ఇంగ్లిషులో రాసి ఉన్న ఆ ఉత్తరాన్ని చూసి.. ఎదురుగా నిలుచుని ఉన్న యాచకుడికేసి ఆశ్చర్యంగా చూశారు. ఆ తర్వాత ప్రశ్నల వర్షంతో విచారించాగ... అతను ఓ మాజీ డీఎస్పీ పుత్రుడని, ఇంజినీరుగా పట్టా పొంది మంచి ఉద్యోగం కూడా చేశాడని తెలుసుకుని కంగుతిన్నారు.