అంగరంగ వైభవంగా పెళ్లి ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. తెల్లారితే ముహూర్తం. వరుడి కుటుంబాన్ని ఆనందంగా స్వాగతించారు. అందరూ ఆడుతూ పాడుతూ సంతోషంగా ఉన్నారు. అప్పుడే.. ఓ పిడుగు లాంటి నిజం బయటపడింది. పెళ్లికుమారుడు మారిపోయాడని తెలిసిపోయింది. ఇంకేముంది.. వరుడి కుటుంబాన్ని ఓ గదిలో వేసి బంధించేశారు పెళ్లి కుమార్తె బంధువులు.
ఉత్తర్ప్రదేశ్ ఈటా, ధంతిగార గ్రామానికి చెందిన సంజీవ్ కుమార్.. కొద్ది రోజుల క్రితం, మెయిన్పురీకి చెందిన ఓ యువకుడితో కూతురి పెళ్లి ఖాయం చేశాడు. అనుకున్నట్టుగానే, పెళ్లి పనులన్నీ పూర్తి చేశారు. అయితే, విడిదింటికి విచ్చేసిన పెళ్లి కుమారుడిని చూసి ఖంగు తిన్నాడు సంజీవ్. తాము సంబంధం మాట్లాడుకున్న అబ్బాయి స్థానంలో మరెవరో కనిపించారు.