సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయిపై.. సర్వోన్నత న్యాయస్థానం మాజీ ఉద్యోగిని చేసిన లైంగిక ఆరోపణలను బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (బీసీఐ) ఖండించింది. న్యాయ వ్యవస్థను అప్రతిష్ఠపాలు చేయాలనే కుట్రలో భాగంగానే ఇలాంటి నిరాధార, తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడింది. జస్టిస్ రంజన్ గొగొయికి పూర్తి మద్దతుగా నిలుస్తామని స్పష్టం చేసింది.
ఈ విషయంపై బీసీఐని ఆదివారం అత్యవసర సమావేశపరిచి, తీర్మానం ప్రవేశపెడతామని సమాఖ్య ఛైర్పర్సన్ మనన్ కుమార్ మిశ్రా తెలిపారు. సమావేశంలో తీసుకున్న నిర్ణయాన్ని సీజేఐ దృష్టికి తీసుకెళ్తామన్నారు.
ఇన్‌హౌస్ విచారణ జరగాలి
సుప్రీంకోర్టు సీనియర్ న్యాయమూర్తితో ఈ విషయంపై ఇన్-హౌస్ విచారణ జరిపించాలని సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ (ఎస్సీబీఏ) మాజీ అధ్యక్షుడు, సీనియర్ న్యాయవాది వికాస్ సింగ్ అభిప్రాయం వ్యక్తం చేశారు. అప్పుడే నిజానిజాలు తెలుస్తాయన్నారు.
విచారణలో ఆరోపణలన్నీ నిరాధారమని తేలితే స్వతంత్ర న్యాయ వ్యవస్థకు ముప్పు తలపెట్టినట్టేనని స్పష్టం చేశారు సింగ్. ఒకవేళ ఆరోపణలు రుజువైతే అది కూడా అత్యంత ప్రమాదకరమేనని వ్యాఖ్యానించారు.