ప్రభుత్వ రంగ బ్యాంకుల సామర్థ్యాన్ని పెంచే దిశగా అడుగులు వేసింది కేంద్రం. ప్రభుత్వ రంగ బ్యాంకుల రుణ పరపతిని పెంచేందుకు రూ. 70 వేల కోట్లు అందించనున్నామని బడ్జెట్ ప్రసంగంలో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. ఒక ప్రభుత్వ రంగ బ్యాంకు ఖాతాదారు అన్ని ప్రభుత్వ బ్యాంకుల్లోనూ సేవలు పొందే వీలు కల్పిస్తున్నామని ప్రకటించారు.
'రుణాలు పెంచేందుకు బ్యాంకులకు రూ. 70 వేల కోట్లు' "బ్యాంకింగ్ వ్యవస్థ ప్రక్షాళన ద్వారా ఆదాయాన్ని పొందాం. వాణిజ్య బ్యాంకులకు చెందిన నిరర్ధక ఆస్తులను లక్ష కోట్ల మేర తగ్గించాం. దివాలా చట్టంతో రూ. 4 లక్షల కోట్ల మొండి బకాయిలు వసూలు చేశాం. దేశీయ రుణాలు 13.8 శాతం పెరిగాయి.
ప్రభుత్వ రంగ బ్యాంకులను ఏకీకృతం చేసి, వాటి సంఖ్యను 8కి తగ్గించాం. ఆరు ప్రభుత్వ బ్యాంకులను రుణ సంక్షోభం నుంచి గట్టెక్కించాం. రుణ పరపతి పెంచేందుకు బ్యాంకులకు రూ. 70 వేల కోట్లు అందజేయనున్నాం. బ్యాంకింగ్ రంగ సేవల్లో మెరుగుదల కోసం ఆన్లైన్లో వ్యక్తిగత రుణాలు, ఇంటి వద్దకే సేవలు, ఒక ప్రభుత్వ బ్యాంకు ఖాతాదారు అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో సేవలు పొందేందుకు వీలు కల్పిస్తున్నాం. రూ. లక్ష కోట్లను ప్రభుత్వ రంగ బ్యాంకులకు క్రెడిట్ గ్యారంటీ అందించనున్నాం. "
-నిర్మలా సీతారమన్, ఆర్థిక మంత్రి
ఇదీ చూడండి: బడ్జెట్ 2019 : 'జ్ఞాన భారతమే లక్ష్యం'