ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)... కోల్‌కతాకు చెందిన శ్రీ గణేష్ జ్యువెలరీ హౌస్ (ఐ) లిమిటెడ్‌కు, దాని ప్రమోటర్లకు 'ఫెమా షోకాజ్ నోటీసు' జారీ చేసింది. ఇప్పటి వరకు ఈడీ జారీ చేసిన ఫెమా నోటీసుల్లో ఇదే అతిపెద్దది కావడం గమనార్హం.
"శ్రీ గణేష్ జ్యువెలరీ హౌస్ (ఐ) లిమిటెడ్, దాని ప్రమోటర్లు.. విదేశాల్లో రూ.7,220 కోట్ల మేర విదేశీ మారక ద్రవ్య అక్రమాలకు పాల్పడినట్లు గుర్తించాం. ఈ ఆభరణాల సంస్థ... ఉద్దేశపూర్వకంగా బ్యాంకు రుణం ఎగవేసినట్లు, అలాగే అక్రమ లావాదేవీలకు పాల్పడినట్లు కూడా దర్యాప్తులో తెలిసింది. అందుకే ఫారెన్ ఎక్స్ఛేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ (ఫెమా) కింద షోకాజ్ నోటీసు జారీ చేశాం."
- ఈడీ ప్రత్యేక దర్యాప్తు అధికారి
ఉద్దేశపూర్వక ఎగవేతదారు
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ప్రకారం, దేశంలోని టాప్ 100 ఉద్దేశపూర్వక బ్యాంకు రుణం ఎగవేతదారుల్లో శ్రీ గణేష్ జ్యువెలరీ హౌస్ ఉంది. దాని ప్రమోటర్లు - నీలేశ్ పరేఖ్, ఉమేశ్ పరేఖ్, కమలేశ్ పరేఖ్ సోదరులపై ఈ మేరకు అభియోగాలు నమోదయ్యాయి. ఇప్పటికే ఈ కేసుపై కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ), డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) దర్యాప్తు చేస్తున్నాయి.
ఈ బ్యాంకు ఫ్రాడ్ కేసులో నీలేశ్ పరేఖ్‌ను 2018లోనే డీఆర్ఐ అరెస్టు చేసింది.