అంధులు రోడ్డుపై నడిచేప్పుడు ముందు వచ్చే వాహనాలు, ఇతర వస్తువులను గుర్తించలేక ఇబ్బందులు పడుతుంటారు. ఇలాంటి వారి ఇబ్బందులను గుర్తించిన బెంగళూరుకు చెందిన ఇశాంత్ అనే విద్యార్థి ప్రత్యేక ఊతకర్రను రూపొందించాడు.
ప్రస్తుతం బెంగళూరులో 107వ యూత్ సైన్స్ కాంగ్రెస్ జరుగుతోంది. ఈ కార్యక్రమంలో పలువురు విద్యార్థులు తమ ఆవిష్కరణలను ప్రదర్శిస్తున్నారు. అయితే.. ఇశాంత్ రూపొందించిన అంధుల ఊతకర్ర ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.
అంధులు ఈ కర్ర పట్టుకుని వెళుతున్న క్రమంలో ముందు ఏదైనా వస్తే వైబ్రేట్ అయ్యి.. హెచ్చరిస్తుందని చెబుతున్నాడీ కుర్రాడు.
అంధులను హెచ్చరించే 'వాకింగ్ స్టిక్' ఆవిష్కరించిన విద్యార్థి "అంధుల కోసం ఇది తయారు చేశాను. నా బంధువు ఒకరికి చూపు సరిగా ఉండదు. ఆయన్ను చూసే ఇలాంటి వారి కోసం ఏదైనా చేయాలనుకున్నాను. రోబోటిక్ తరగతులకు వెళ్లాను. ఆ తర్వాత ఈ స్టిక్ తయారు చేశాను. ఈ స్టిక్ ప్రత్యేకత ఏంటంటే.. ఇందులో అల్ట్రాసోనిక్ సెన్సార్లు ఉపయోగించా. ఇంకా బజర్, బ్యాటరీలు ఉంటాయి. నడిచేటప్పుడు ఏమైనా అడ్డు వస్తే.. అల్ట్రాసోనిక్ సెన్సార్ గుర్తిస్తుంది. వెంటనే ఇక్కడ ఏదో అడ్డు వచ్చింది... పక్కకు జరగమని సంకేతమిస్తుంది. ఇది చాలా ఉపయోగకరం. ఇందులో మూడు పరిధులు ఉన్నాయి. ఏదైనా వస్తువు మనకు బాగా దగ్గరగా ఉంటే.. ఇది అలా మోగుతూనే ఉంటుంది. కొంచెం దూరంలో ఉంటే విరామమిస్తూ మోగుతుంది. ఇదే బ్లైండ్ స్టిక్ ధర యూఎస్‌లో 800 డాలర్ల వరకు ఉంటుంది. ఈ స్టిక్ అయితే రూ.500 ఖర్చు అవుతుంది అంతే."
- ఇషాంత్, విద్యార్థి.