బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ హసీనా గురువారం నుంచి నాలుగు రోజులపాటు భారత్లో పర్యటించనున్నారు. వరుసగా మూడోసారి ప్రధాని బాధ్యతలు చేపట్టిన అనంతరం హసీనా భారత్లో పర్యటించడం ఇదే తొలిసారి.
ప్రపంచ ఆర్థిక సదస్సుకు అనుబంధంగా గురు, శుక్రవారాల్లో జరగనున్న భారత ఆర్థిక సదస్సులో హసీనా ప్రసంగించనున్నారు. ఈ సదస్సుల్లో సింగపూర్ ఉప ప్రధాని, ఆర్థికమంత్రి హెంగ్ స్వీ కియట్, దక్షిణాసియాలోని యూఎన్ మహిళా రాయబారి, భారత్ టెన్నిస్ స్టార్ క్రీడాకారిణి సానియా మీర్జా సహా ఇతర ముఖ్య అధికారులు పాల్గొనున్నారు.
5న మోదీతో భేటీ...
ఈ నెల 5న భారత ప్రధాని నరేంద్రమోదీతో ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు హసీనా. మోదీ ప్రధానిగా రెండోసారి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఇరు నేతలు భారత్లో భేటీకావడం ఇదే తొలిసారి కానుంది.
వివిధ ఒప్పందాలతో పాటు ప్రధానులు ఇద్దరు కలిసి మూడు ద్వైపాక్షిక ప్రాజెక్టులను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభిస్తారని భారత విదేశాంగశాఖ తెలిపింది.
మోదీతో పాటు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, విదేశాంగమంత్రి జయ్శంకర్, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీతో బంగ్లాదేశ్ ప్రధాని సమావేశం కానున్నారు. తన తండ్రి బంగబంధు షేక్ ముజిబర్ రెహ్మాన్ బయోపిక్ నిర్మాణంపై ప్రముఖ దర్శకుడు శ్యామ్ బెనగల్తో హసీనా చర్చించనున్నారు.
ఎన్ఆర్సీపై ఆందోళన...
ఎన్ఆర్సీపై బంగ్లాదేశీయుల్లో అందోళన వ్యక్తమవుతున్న తరుణంలో హసీనా భారత్ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది.
ఇటీవల న్యూయార్క్ ఐరాస సర్వసభ్య సమావేశం సందర్భంగా ఎన్ఆర్సీ వ్యవహారం మోదీ, హసీనా మధ్య చర్చకు వచ్చినట్లు సమాచారం. ఇరు దేశాల మధ్య ఉన్న సత్సంబంధాల దృష్ట్యా ఆ సమస్యను సులభంగా పరిష్కరించవచ్చని హసీనాకు మోదీ హామీ ఇచ్చినట్టు బంగ్లాదేశ్ విదేశాంగమంత్రి అబ్దుల్ మోమెన్ తెలిపారు. అయితే సమావేశం అనంతరం భారత విదేశాంగశాఖ జారీ చేసి ప్రకటనలో ఎన్ఆర్సీ అంశం లేదు.
సమస్య పరిష్కారానికి మోదీ హామీ ఇచ్చారని బంగ్లాదేశే చెబుతున్నా... ఎన్ఆర్సీ వ్యవహారం ఆ దేశ పాలకులను కలవరపెడుతోంది. భారత్లో ఎన్ఆర్సీ చుట్టూ నెలకొన్న రాజకీయాలు.., భాజపా,ఆర్ఎస్ఎస్ నేతల వివాదాస్పద వ్యాఖ్యలే ఇందుకు కారణం. బంగ్లాదేశీ వలసదారులను ఉద్దేశించి భారత హోంమంత్రి అమిత్ షా ప్రయోగించిన పదజాలం ఎంతో అవమానకరంగా ఉందని తమ దేశస్థులు భావిస్తున్నట్టు హసీనా ప్రభుత్వంలోని ఓ అధికారి తెలిపారు.