తెలంగాణ

telangana

ETV Bharat / bharat

అద్భుతం: 400 గ్రాముల నవజాత శిశువు క్షేమం - 400 గ్రాముల శిశువు జననం

నెలలు నిండకముందే 400 గ్రాముల బరువుతో జన్మించిన శిశువు ప్రాణాలు నిలిపి అద్భుతం చేశారు గుజరాత్​లోని అహ్మదాబాద్​ ప్రభుత్వాసుపత్రి వైద్యులు. ప్రత్యేక శ్రద్ధతో వైద్యం అందించి తల్లిదండ్రుల కళ్లల్లో ఆనందం నింపారు. 54 రోజుల్లోనే అనూహ్యరీతిలో కోలుకుని 930 గ్రాములకు చేరుకుంది చిన్నారి.

Baby born weighing 436 gm survives in Gujarat
జీవితంతో పోరాడి గెలిచిన ఆరు నెలల చిన్నారి

By

Published : Dec 13, 2020, 10:59 AM IST

గుజరాత్​లోని అహ్మదాబాద్​ ప్రభుత్వాసుపత్రి వైద్యులు అద్భుతం చేశారు. నెలలు నిండక ముందే అత్యంత తక్కువ బరువుతో పుట్టిన ఓ నవజాత శిశువును ఎంతో శ్రమకోర్చి ప్రాణాలు నిలిపి వైద్యో నారాయణో హరిః అన్న మాటకు నిదర్శనంగా నిలిచారు.

మధ్యప్రదేశ్​కు చెందిన జితేంద్ర అంజానే, రేణు దంపతులు కూలీలు. రేణు గర్భం దాల్చిన రెండు నెలల తర్వాత ఆమెకు తీవ్రమైన కాలేయ వ్యాధి ఉన్నట్లు తేలింది. అసలే పేదరికం.. దానికి తోడు జబ్బున పడటం వల్ల రేణు దిగాలు పడింది. తన ఆరోగ్యం సరే.. కడుపులో బిడ్డైనా బతుకుతుందా లేదా అన్న ఆవేదనతో తల్లడిల్లిపోయింది. తన ఆరోగ్యం గురించి ఇండోర్​లోని వైద్యులను సంప్రదించినా ప్రయోజనం లేకపోయింది. కొందరి సలహా మేరకు ఆ దంపతులు అహ్మదాబాద్​ ఆసుపత్రికి వెళ్లారు. అక్కడ చికిత్స తీసుకున్న తర్వాత ఆమె ఆరోగ్యం కాస్త కుదుటపడింది.

అయితే.. ఆరున్నర నెలల గర్భం తర్వాత మళ్లీ పరిస్థితి విషమించింది. కాలేయ వ్యాధి ముదిరిందని, అలాంటి సమయంలో గర్భం కొనసాగిస్తే తల్లికి, బిడ్డకు ఇద్దరికీ ప్రమాదమని వైద్యులు చెప్పారు. వెంటనే కాన్పు చేయాలని, పుట్టబోయే శిశువు ప్రాణాలతో ఉంటుందా లేదా చెప్పడం కష్టమని వైద్యులు తెలపడం వల్ల ఆ దంపతులు తల్లడిల్లిపోయారు. గత్యంతరం లేని పరిస్థితుల్లో కాన్పునకు అంగీకరించారు. రేణు 436 గ్రాముల బరువున్న ఆడ శిశివుకు జన్మనిచ్చింది. ఊపిరితిత్తులు, గుండె సరిగ్గా లేకపోవటం వల్ల ఆసుపత్రిలోని నియోనాటల్​ ఇంటెన్సివ్​ కేర్​ యూనిట్​ (ఎన్​ఐసీయూ)కు తరలించి చికిత్స అందించారు. దాదాపు 54 రోజుల తర్వాత 930 గ్రాముల బరువుకు చేరుకుంది ఆ చిన్నారి.

అంత తక్కువ బరువుతో పుట్టడం ఆ ఆసుపత్రిలో ఇదే తొలిసారని అక్కడి వైద్యులు తెలిపారు. అయితే.. ప్రత్యేక శ్రద్ధ తీసుకుని పాప ప్రాణాలను నిలబెట్టి రేణు దంపతుల జీవితాల్లో ఆనందం నింపారు.

ఇదీ చూడండి: అన్నదాతకే ఆకలి తీర్చిన చిన్నారి

ABOUT THE AUTHOR

...view details