28 ఏళ్ల నుంచి ఉత్కంఠగా ఎదురుచూస్తోన్న బాబ్రీ మసీదు కేసుపై ఎట్టకేలకు తీర్పు వెలువడింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న మాజీ ఉప ప్రధాని ఎల్.కె.ఆడ్వాణీ(92), మురళీ మనోహర్ జోషి(86), ఉమా భారతితో పాటు ఆరోపణలు ఎదుర్కొంటున్న 32మందిని నిర్దోషులుగా తేల్చింది సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం.
ఈ కేసులో నిందితులపై మోపిన అభియోగాలు నిరూపించేందుకు ఎలాంటి ఆధారాలు లేవని న్యాయస్థానం తెలిపింది. నిందితులు నేరపూరిత కుట్రకు పాల్పడ్డారని సీబీఐ రుజువు చేయలేకపోయిందని పేర్కొంది. మసీదు కూల్చివేత ఘటన ముందస్తు ప్రణాళిక ప్రకారం జరిగింది కాదని వెల్లడించింది.
ఇదీ చూడండి: 'బాబ్రీ' కేసు: 28 ఏళ్లలో మలుపులెన్నో...
351 మంది సాక్షులు..
న్యాయమూర్తి సురేంద్ర కుమార్ యాదవ్ ఈ తీర్పును వెల్లడించారు. విచారణలో భాగంగా 351 మంది సాక్షులను సీబీఐ విచారించింది. ఈ కేసులో మొత్తం 49 మంది నిందితులు ఆరోపణలు ఎదుర్కోగా కేసు విచారణలో ఉండగానే 17మంది మరణించారు.
కోర్టులో నిందితులు..
తీర్పు సమయంలో ప్రస్తుతమున్న 32మంది నిందితులంతా కోర్టులో హాజరు కావాలని సెప్టెంబర్ 16న న్యాయమూర్తి ఆదేశాలిచ్చారు. అయితే, వయోభారం, కరోనా వ్యాప్తి దృష్ట్యా ఆడ్వాణీ, మురళీ మనోహర్ జోషి, మహంత్ నృత్యగోపాల్ దాస్ కోర్టుకు హాజరు కాలేదు. ఉమాభారతి, కల్యాణ్ సింగ్‌కు కరోనా సోకడం వల్ల వారు ప్రస్తుతం ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. దీంతో వారు తీర్పు సమయంలో కోర్టుకు హాజరుకాలేదు. వీరంతా తీర్పు సమయంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అందుబాటులో ఉన్నారు.
సాక్షి మహారాజ్, వినయ్ కటియార్, ధరమ్ దాస్, పవన్ పాండే, వేదాంతి, లల్లూసింగ్, చంపత్‌రాయ్‌తోపాటు మిగతావారంతా కోర్టుకు హాజరయ్యారు.